Serum: ఒక్క జూన్‌లోనే 10కోట్ల డోసుల ఉత్పత్తి! 

తాజా వార్తలు

Published : 27/06/2021 23:20 IST

Serum: ఒక్క జూన్‌లోనే 10కోట్ల డోసుల ఉత్పత్తి! 

టీకా ఉత్పత్తి వేగం పెంచిన సీరం ఇన్‌స్టిట్యూట్‌

పుణె: వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. జూన్‌ నెలలో రికార్డుస్థాయిలో 10కోట్లకుపైగా కొవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తోన్న వేళ.. వ్యాక్సినేషన్‌ పంపిణీ వేగవంతం చేయడంలో టీకా తయారీ సంస్థలు చేస్తోన్న ప్రయత్నాలు ఊరట కలిగిస్తున్నాయి.

డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు సీరం ఇన్‌స్టిట్యూట్‌ అందించిన వివరాల ప్రకారం, జూన్‌ నెలలో ఇప్పటివరకు 45 బ్యాచ్‌లలో కొవిషీల్డ్‌ డోసులను పంపించింది. అందులో 10.80కోట్ల డోసులను కసౌలీలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబ్‌కు సరఫరా చేసినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. మే నెలలో 6.5కోట్ల డోసులుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్‌ నాటికి గణనీయంగా పెంచినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. జూన్‌ నుంచి ప్రతినెల పది కోట్ల డోసులను అందజేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభిప్రాయపడింది.

నిత్యం సరాసరి 69లక్షల డోసుల పంపిణీ..

ప్రస్తుతం దేశంలో 18ఏళ్ల వయసుపైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ నడుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా నిత్యం కనీసం 50లక్షల మందికి వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, గడిచిన 24గంటల్లో 64లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించారు. వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ ప్రారంభమైన (జూన్‌ 21) నుంచి గడిచిన ఆరు రోజుల్లో నిత్యం సరాసరి 69లక్షల డోసులను పంపిణీ చేశారు. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32.17కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను అందించారు.

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోన్న వేళ.. చాలా దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. దీంతో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ డోసుల ఉత్పత్తిని పెంచేందుకు అన్ని వనరులను వినియోగించుకునేందుకు ఆయా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్‌లో ప్రతి నెల 10కోట్ల డోసుల కొవిషీల్డ్‌ టీకాను ఉత్పత్తి చేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అటు మరో వ్యాక్సిన్‌ సంస్థ భారత్‌ బయోటెక్‌ కూడా టీకాల ఉత్పత్తిని  గణనీయంగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని