
తాజా వార్తలు
‘సీరం’ అగ్నిప్రమాదం.. నష్టం ₹1000 కోట్లు పైనే!
ఎస్ఐఐ సీఈవో పూనావాలా వెల్లడి
ముంబయి: కరోనా నివారణకు ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను తయారుచేసిన ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పుణెలోని మంజరి ప్రాంగణంలోని కొత్త ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు మృతిచెందారు. అయితే, ఈ ప్రమాదంతో తమ సంస్థకు ఆర్థికంగా రూ.1000 కోట్ల కంటే ఎక్కువే నష్టం వాటిల్లినట్టు ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం కరోనా వ్యాక్సిన్ల తయారీపై ఎలాంటి ప్రభావం చూపకపోయినప్పటికీ.. కొత్తగా ఉత్పత్తి చేయబోయే మార్గాలను మాత్రం దెబ్బకొట్టిందని తెలిపారు. వ్యాక్సిన్లు తయారీ జరిగిన చోట మంటలు చెలరేగలేదన్న ఆయన.. టీకాల తయారీకి అక్కడ ఉంచిన పరికరాలు, ఇతర ప్రొడక్ట్‌లు దెబ్బతిన్నాయన్నారు. రోటా, బీసీజీ టీకాలకు సంబంధించి భారీగా నష్టం జరిగినట్టు తెలిపారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీరమ్ ఇన్స్టిట్యూట్ను శుక్రవారం సందర్శించారు. కొవిషీల్డ్ టీకాకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. ‘కరోనా టీకా యావత్ ప్రపంచానికి ఓ ఆశాకిరణం. సీరంలో అగ్నిప్రమాద ఘటన గురించి విని మనమంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. సీరమ్‌ను సందర్శించిన తర్వాత వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్‌కు ఎలాంటి నష్టం జరగలేదని భరోసా ఇస్తున్నా. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఈ ఘటనకు కారణాలేంటనేది దర్యాప్తు జరిగిన తర్వాతే తెలుస్తుంది’’ అని చెప్పారు.
ఇదీ చదవండి..
సీరం ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం