Ever Given: రాకాసి ఓడ ఇక రవాణాకు!

తాజా వార్తలు

Published : 05/07/2021 20:04 IST

Ever Given: రాకాసి ఓడ ఇక రవాణాకు!

నష్టపరిహారంపై కుదిరిన ఒప్పందం

కైరో: సూయజ్ కాలువకు అడ్డంగా చిక్కుకుని రూ. వేల కోట్ల నష్టం కలిగించిన ‘ఎవర్ గివెన్’ నౌక విడుదలకు ఎట్టకేలకు మార్గం సుగమం అయ్యింది. నష్టపరిహారం ఇవ్వనిదే నౌకను విడుదల చేయమని సూయజ్ కెనాల్ అథారిటీ స్పష్టం చేయడంతో మార్చి నెల నుంచి ఈ నౌక అక్కడే ఉండిపోయింది. అయితే, నష్టపరిహారం చెల్లించడంపై ఎట్టకేలకు నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాంతో ఎవర్ గివెన్ నౌక సూయజ్ కాలువ నుంచి కదలడానికి కెనాల్ అథారిటీ నుంచి అనుమతి లభించింది.

ఈ ఏడాది మార్చిలో సూయజ్‌ కాలువలో అడ్డంగా చిక్కుకుపోయింది ఎవర్‌ గివెన్‌ అనే భారీ సరకు రవాణా నౌక. దాంతో ఆ మార్గంలో కొన్ని రోజులపాటు రవాణా ఆగిపోయింది. రోజుకు దాదాపు రూ.70 వేల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేశారు. దాదాపు వారంరోజుల పాటు శ్రమించి ఈ నౌకను కాలువకు అడ్డు తప్పించారు. అయితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి, తిరిగి ప్రయాణం ప్రారంభించేందుకు ఈ నౌకకు సూయజ్‌ కెనాల్‌ అథారిటీ (ఎస్‌సీఏ) అనుమతివ్వలేదు. ఈ నౌక సూయజ్‌ కాలువలో ఆగిపోవడం వల్ల ఆ మార్గంలో జల రవాణాకు ఆటంకం కలిగిందని, దానికి నష్టపరిహారం చెల్లిస్తేనే నౌకను అక్కడి నుంచి కదలనిస్తామని ఎస్‌సీఏ స్పష్టం చేసింది. ఆ మార్గంలో జలరవాణా ఆగిపోవడం వల్ల కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ సూయజ్‌ కెనాల్‌ అథారిటీ.. ఈజిప్టు కోర్టులో దావా వేసింది. 91.6 కోట్ల అమెరికన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఎస్‌సీఏ కోరింది. అనంతరం ఆ మొత్తాన్ని 55 కోట్ల అమెరికన్‌ డాలర్లకు తగ్గించింది. 

అయితే నష్టపరిహారం చెల్లించడంపై నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీల మధ్య పీఠముడి పడింది. ఈ డబ్బు ఎవరు చెల్లించాలనే విషయంలో ఎవర్‌ గివెన్‌ నౌక యజమాని జపాన్‌కు చెందిన షోయి కిసెన్‌, బీమా కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. దాదాపు మూడు నెలల తర్వాత ఎట్టకేలకు నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీల మధ్య ఆదివారం ఓ ఒప్పందం కుదిరింది. దాంతో ఈ నౌక సూయజ్‌ కాలువ నుంచి కదిలేందుకు కెనాల్‌ అథారిటీ నుంచి అనుమతి లభించింది. బుధవారం పరిహార ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని ఎస్‌సీఏ వెల్లడించింది.

ఎంత పరిహారానికి ఒప్పందం కుదిరిందనే విషయాన్ని మాత్రం ఎస్‌సీఏ కానీ, నౌక యజమాని కానీ, బీమా సంస్థ కానీ బహిర్గతం చేయలేదు. ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా 75 టన్నుల సామర్థ్యంగల ఒక టగ్‌బోట్‌ మాత్రం సూయజ్‌ కెనాల్‌ అథారిటీకి వస్తుందని ఎస్‌సీఏ ఛైర్మన్‌ ఒసామా రబీ పేర్కొన్నారు. ఎవర్‌ గివెన్‌ నౌక అడ్డంకులు సృష్టించినా.. సూయజ్‌ కెనాల్ అథారిటీకి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మూడు బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది. గతేదాడితో పోలిస్తే ఇది 8.8 శాతం అధికం కావడం గమనార్హం.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని