కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ నిరసన
close

తాజా వార్తలు

Published : 04/03/2021 21:52 IST

కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ నిరసన

జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా నినాదాలు
చొక్కావిప్పి నిరసన తెలిపిన ఎమ్మెల్యే, వారం పాటు సస్పెండ్‌

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో గురువారం కాంగ్రెస్‌ నిరసనగళం వినిపించింది. అసెంబ్లీలో భాజపా ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశాన్ని లేవనెత్తడంతో కాంగ్రెస్‌ సభ్యులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో భద్రావతి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీకే సంగమేష్‌ తన చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభాపతి విశ్వేశ్వర్‌ హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్య ప్రవర్తనతో సభను అగౌరవ పరచారని ఆయన్ను వారం పాటు సస్పెండ్‌ చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు.

జమిలి ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ భావజాలంలో భాగంగా ఈ జమిలి ఎన్నికల విధానాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మాట్లాడుతూ ఇది రాజకీయ అజెండా మాత్రమేనన్నారు. దానిని కాంగ్రెస్‌ ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. అసెంబ్లీలో అధికార పార్టీ జమిలి ఎన్నికల అంశం లేవనెత్తగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపాకు, ఆర్ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సారి బడ్జెట్‌ సమావేశాల్లో అధికార భాజపాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ అస్త్రాలను సిద్ధం చేసుకుంది. వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం, రాష్ట్ర ఆర్థిక స్థితి, అక్రమ క్వారీల తవ్వకం వంటి విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని