30ఏళ్లుగా పోలీసు.. మీ వాళ్లని మీరే నమ్మట్లేదా?
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30ఏళ్లుగా పోలీసు.. మీ వాళ్లని మీరే నమ్మట్లేదా?

పరమ్‌బీర్‌ సింగ్ పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం

దిల్లీ: తనపై జరుగుతున్న అన్ని విచారణలను మహారాష్ట్ర వెలుపలకు బదిలీ చేయాలని కోరుతూ ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 30ఏళ్లకు పైగా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్‌ అధికారి తన సొంత రాష్ట్ర పోలీసులనే నమ్మకపోవడం దిగ్భ్రాంతికరమని పేర్కొంది.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌.. పోలీసు అధికారి సచిన్‌ వాజేకు ప్రతి నెలా రూ.100కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ పరమ్‌ బీర్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన హోంగార్డ్‌ డీజీగా బదిలీ అయ్యారు. మరోవైపు ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. వీటికి సంబంధించిన విచారణలన్నింటినీ మహారాష్ట్ర వెలుపలకు బదిలీ చేయాలని ,అంతేగాక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన జస్టిస్‌ హేమంత్‌ గుప్తా నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌.. పరమ్‌ బీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘ఇది చాలా షాకింగ్‌గా ఉంది. మహారాష్ట్ర రాష్ట్ర కేడర్‌కు చెందిన మీరు 30ఏళ్లకు పైగా ఇక్కడే సేవలందిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మీ సొంత రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని చెబుతున్నారు. మీ పోలీసు శాఖను మీరే అనుమానించడం సరికాదు. విచారణను బదిలీ చేయమని అడగకూడదు’’ అంటూ ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది. 

పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టు తర్వాత పరమ్‌ బీర్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌.. వాజేకు నెలనెలా రూ.100 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. అంతేగాక.. తన ఆరోపణలపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. అయితే దీనిపై ముందు బాంబే హైకోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. 

ఆ తర్వాత బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ విచారణాధికారి తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ పరమ్‌బీర్‌ ఇటీవల ఆరోపించారు. కాగా.. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఆరోపణల కేసుకు సంబంధించి విచారణతో పాటు మరో కేసులోనూ రాష్ట్ర పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని