‘చైనా టీకా అత్యంత ప్రమాదకరం’

తాజా వార్తలు

Published : 08/01/2021 15:54 IST

‘చైనా టీకా అత్యంత ప్రమాదకరం’

వెల్లడించి..తర్వాత మాట మార్చిన ఆ దేశ వైద్యనిపుణుడు

బీజింగ్ ‌: చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అదే దేశానికి చెందిన ఓ వైద్యనిపుణుడు టావో లినా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చైనా ప్రభుత్వ అధీనంలోని సైనోఫామ్‌ అనే సంస్థ తయారు చేసిన కరోనా టీకా అంత సురక్షితమైంది కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనివల్ల 73 రకాల దుష్ర్పభావాలు తలెత్తుతాయని వెల్లడించారు. ప్రపంచంలో మరే టీకా ఇంత ప్రమాదకరం కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన చైనా ట్విటర్‌గా చెప్పుకునే సామాజిక మాధ్యమం వెబోలో వెల్లడించారు. ఆయనకు వెబోలో 4.8 మిలియన్ల అనుచరులు ఉండడం గమనార్హం.

ఈ విషయాన్ని విదేశీ మీడియా సంస్థలు హైలైట్‌ చేయడంతో టావో మాట మార్చారు. విదేశీయులు తన మాటల్ని వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యల్లో కొన్ని పదాలు విచక్షణ కోల్పోయి చేసినవని ఆయన వ్యాఖ్యానించారు. పదాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని తెలిపారు. అందుకు దేశ ప్రజలు తనని క్షమించాలని కోరారు. వ్యాక్సిన్‌ భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పుకొచ్చారు. తానూ సైనోఫామ్‌ టీకా తీసుకున్నానని.. త్వరలో రెండో డోసు కూడా వేయించుకోబోతున్నానని చెప్పారు. టావో వ్యాఖ్యలు ప్రస్తుతం వెబో నుంచి తొలగించడం గమనార్హం.

ఈ వార్తలపై చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ స్పందించింది. టావో వ్యాఖ్యల్ని విదేశీ మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చింది. సైనోఫామ్‌ను విమర్శిస్తున్న ప్రత్యర్థులపై టావో చేసిన వ్యంగ్య వ్యాఖ్యల్ని విదేశీ మీడియా తప్పుగా అర్థం చేసుకుందని వివరించింది. సైనోఫామ్‌ అత్యవసర వినియోగానికి చైనా ప్రభుత్వం డిసెంబరు 31న షరతులతో కూడిన అనుమతుల్ని జారీ చేసింది. ఈ టీకా సామర్థ్యం 79.34 శాతంగా సంస్థ ప్రకటించింది.

కరోనా వైరస్‌ నియంత్రణలో చైనా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని తొలినాళ్లలో తొక్కిపెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కరోనాపై బహిరంగంగా మాట్లాడిన పలువురు ప్రముఖుల పట్ల అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. వైరస్‌ను తొలిసారి గుర్తించిన వెన్‌లియాంగ్‌ను చిత్ర హింసలకు గురిచేసింది. వైరస్‌ పుట్టిన వుహాన్‌లో పరిస్థితిపై నివేదించినందుకు పలువురు జర్నలిస్టుల్ని నిర్బంధించింది. ఇక మహమ్మారి మూలాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తల పట్ల పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా టీకాపైనా సర్వత్రా అనుమానాలు రేకెత్తాయి. తాజాగా టావో వ్యాఖ్యలతో వాటికి బలం చేకూరినట్లయింది.

ఇవీ చదవండి..

కరోనా అని.. విమానమంతా బుక్‌ చేసుకుని!

70 నుంచి 85శాతం మందికి టీకాలు వేస్తేనే..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని