వ్యాక్సిన్‌తో చిన్నపాటి చర్మ సమస్యలు!
close

తాజా వార్తలు

Published : 23/06/2021 01:22 IST

వ్యాక్సిన్‌తో చిన్నపాటి చర్మ సమస్యలు!

అతిగా ఊహించుకుని భయపడవద్దు!

దిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. మరోవైపు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. కేసుల  సంఖ్య తగ్గేందుకు ఇది కూడా కారణం కావొచ్చు. అయితే, వ్యాక్సిన్‌ వేయించుకున్న కొందరిలో చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు  వైద్యులు గుర్తించారు. ఇలాంటి  కేసులు దిల్లీ, ముంబయిలో ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. అయితే దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత చాలా మందికి  నీరసం,  జర్వం, ఒళ్లునొప్పులు వస్తున్నాయి. కానీ, మరికొంత మందిలో దద్దుర్లు, చర్మం ఎర్రగా మారిపోవడం లాంటి లక్షణాలను దిల్లీలోని కొందరు వైద్యులు గుర్తించారు.  మరోవైపు ముంబయిలోనూ ఇదే తరహా కేసులు వెలుగు చూశాయి.  అయితే , వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత జర్వం రావడం వల్లనే ఇలా దద్దుర్లు ఏర్పడినట్లు చర్మ వైద్యులు చెబుతున్నారు. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనినే అతిగా ఊహించుకొని టీకా తీసుకునేందుకు వెనకాడవద్దని వైద్యులు అంటున్నారు. 

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత  జర్వం రావడం మూలంగా ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చని చెబుతున్నారు. ‘వ్యాక్సిన్‌ వేయించుకున్నాక శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉత్తేజితమవుతుంది. భవిష్యత్తులో కరోనా వైరస్‌ శరరంలోకి ప్రవేశిస్తే దానిని గుర్తించి, పోరాడేందుకు ముందుగానే మన శరీరం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సహజం.  శరీరంలో వేడి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల చిన్నపాటి దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అలా అని ఈ లక్షణాలు అందరిలోనూ కనిపించాలనేం లేదు’ అని దిల్లీలోని ఓ ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని