వారి చేతికి అమెరికా కీలక డేటా..! 

తాజా వార్తలు

Published : 30/03/2021 14:44 IST

వారి చేతికి అమెరికా కీలక డేటా..! 

ఇంటర్నెట్‌డెస్క్‌ : అమెరికాలో కొన్ని నెలలపాటు జరిగిన సోలార్‌ విండ్‌ హ్యాకింగ్‌లో కీలక సమాచారం రష్యా చేతికి వెళ్లినట్లు భావిస్తున్నారు. ట్రంప్‌ కార్యవర్గంలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీ చీఫ్‌(డీహెచ్‌ఎఫ్‌), సైబర్‌ సెక్యూరిటీ విభాగంలోని కీలక సిబ్బందికి చెందిన ఈమెయిల్స్‌ను హ్యాక్‌ చేసినట్ల తెలిసింది. దీనిపై రిపబ్లికన్‌ సెనెటర్‌ రాబ్‌పార్ట్‌మన్‌ మాట్లాడుతూ ‘‘సోలార్‌ విండ్‌ హ్యాకింగ్‌ మన విదేశీ శత్రువులకు పెద్ద విజయం.. మన డీహెచ్‌ఎఫ్‌కు భారీ పరాజయం’’ అని వ్యాఖ్యానించారు. ఆయన హోంల్యాండ్‌ సెక్యూరిటీ కమిటీ సభ్యుడు కూడా.

ఓ పక్క బైడెన్‌ కార్యనిర్వాహకవర్గం.. మరోసారి రష్యా హ్యాకర్లకు సోలార్‌ విండ్‌ లాంటి అవకాశం ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకొంటున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హ్యాకర్ల చేతికి వెళ్లిన వాటిల్లో ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ సమాచారం కూడా ఉంది. కాకపోతే ఈ హ్యాకింగ్‌లో ఎటువంటి సమాచారాన్ని తస్కరించారన్న విషయం చెప్పడం కష్టమని కాలిఫోర్నియాలోని వెక్ట్రా అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ది గార్డియన్‌ పత్రికకు వెల్లడించింది. కీలక డేటా ఈమెయిల్స్‌ రూపంలో బయటకు వెళ్లకుండా ప్రభుత్వ కంప్యూటర్లలోని ప్రొటోకాల్‌ అడ్డుకుంటుంది. అయినా కానీ.. చాలా డేటాను హ్యాకర్లు చేజిక్కించుకున్నారని వెల్లడించింది. ఇప్పటికే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై బైడెన్‌ సర్కారు చర్చిస్తోందని పెంటగాన్‌ సైబర్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ పాల్‌ నకాసోనే తెలిపారు. ఇప్పటికే సాంకేతికంగా వెనుకబడిన అంశాలపై దృష్టిపెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఇటీవల కాలంలో అమెరికాలో హ్యాకింగ్‌లు ఎక్కువైపోయాయి. ఫిబ్రవరి నెలలో ఫ్లోరెడాలోని ఓ పట్టణంలో మంచినీటి సరఫరా వ్యవస్థలో విషం కలపాలని ఓ హ్యాకర్‌ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ విషయాన్ని మార్చిలో గుర్తించారు. చైనా బృందాలే హ్యాకింగ్‌కు ప్రయత్నించినట్లు తర్వాత నిపుణుల బృందాలు తెలిపాయి.

కొన్ని నెలల నుంచి హ్యాకింగ్‌ జరుగుతున్నా..

డిసెంబర్‌ రెండో వారంలో భారీ సైబర్‌ దాడి బయటపడింది. 2020 మార్చి-జూన్‌ మధ్యలో హ్యాకర్లు సోలార్‌ విండ్‌ అనే నెట్‌వర్కింగ్‌ సేవల సంస్థకు చెందిన ‘ఓరియన్‌’ సాఫ్ట్‌వేర్‌లోకి ‘సన్‌బరస్ట్‌’ అనే మాల్‌వేర్‌ను చొప్పించారు. అక్కడి నుంచి ఓరియన్‌ పంపిన సమాచారం స్వీకరించిన కంప్యూటర్లు హ్యాకర్ల అధీనంలోకి వెళ్లాయి. ఈ తరహా ప్రక్రియలను ‘సప్లై చైన్‌’ దాడులు అంటారు. డిసెంబర్‌ ఎనిమిదో తేదీన ‘ఫైర్‌ ఐ’ అనే సంస్థ తొలిసారి ఈ హ్యాకింగ్‌ను గుర్తించే వరకు అగ్రరాజ్యానికి దీనిపై స్పృహ లేదు. తాజా దాడి బాధితుల జాబితాలో అమెరికా ఎనర్జీ, కామర్స్‌, ట్రెజరీ, స్టేట్‌ డిపార్ట్‌మెంట్లతో పాటు, ఫార్చ్యూన్‌ 500లోని కీలక సంస్థలతో సహా 18,000 నెట్‌వర్క్‌లలోకి వైరస్‌ చొరబడటం అమెరికాలో గుబులు రేకెత్తించింది!. కొన్ని నెలల పాటు కంప్యూటర్లు హ్యాకర్ల అధీనంలో ఉండటంతో  నష్టాన్ని అంచనా వేయడానికే చాలా సమయం పట్టనుండటం తీవ్రతను తెలియజేస్తోంది. ఈ దాడి వెనక బలమైన సైబర్‌ ఆయుధ వనరులున్న రష్యా హస్తం ఉందని అమెరికా నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.  ఎందుకంటే 2016లో ఉక్రెయిన్‌పై రష్యా విదేశీ నిఘా విభాగంలోని ‘కోజీబేర్‌’ లేదా ‘ఏపీటీ 29’గా పిలిచే బృందం ఇలాంటి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని