
తాజా వార్తలు
దిల్లీ విమానాశ్రయంలో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్
దిల్లీ: ప్రభుత్వ పరిశోధనాసంస్థ సీఎస్ఐఆర్-ఐజీఐబీ. స్పైస్ హెల్త్ సంయుక్తంగా గురువారం ఉదయం దిల్లీ విమానాశ్రయంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీనిని నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ప్రారంభించారు. అవసరమైన సమయంలో దీనిని అందుబాటులోకి తెచ్చారు అని ఆయన అన్నారు. యూకేలో బయటపడినటువంటి కొత్తరకం వైరస్‌లను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం యూకే, ఇతర దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నారు. దాని ఫలితాలు వచ్చేందుకు వారం రోజుల సమయం పడుతోంది.‘‘48 గంటల్లోగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఫలితాలను ప్రభుత్వానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం దిల్లీ విమానాశ్రయంలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాం. ఈ కొత్త స్ట్రెయిన్‌ను వీలైనంత త్వరగా కనిపెడితే తగిన చర్యలు తీసుకొనేందుకు అవకాశముంది.’’ అని సీఎస్ఐఆర్-ఐజీఐబీ డైరక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు. వైరస్ మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటే దానిని దేశంలోకి రాకుండా అంత కట్టడి చేయవచ్చు అని స్పైస్‌హెల్త్ సీఈవో అవని సింగ్ అన్నారు.
యూకేలో కొత్త స్ట్రెయిన్ బయటపడటంతో డిసెంబరు 22 నుంచి జనవరి 7 వరకూ యూకే నుంచి వచ్చే విమానాలను భారత్ నిషేధించింది. ఆ తర్వాత నుంచి వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కే ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని రావాలి. వారు భారత్‌కు చేరిన తర్వాత ఇక్కడ టెస్టులు చేస్తున్నారు. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు మినహా ఈ పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చినవారికి ఎటువంటి క్వారంటైన్ ఆంక్షలు విధించట్లేదు. యూకే నుంచి వచ్చిన వారు నెగెటివ్ వచ్చినా వారంపాటు క్వారంటైన్లో ఉండాలి. పాజిటివ్ వచ్చిన వారిని సంస్థాగత ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు.
ఇవీ చదవండి..
భారత్‌లో 109కు చేరిన కరోనా కొత్తరకం కేసులు
‘సుప్రీం’ కమిటీ నుంచి తప్పుకొంటున్నా