Sputnik V: అన్ని వేరియంట్లపై పనిచేస్తోంది..!

తాజా వార్తలు

Published : 13/07/2021 15:23 IST

Sputnik V: అన్ని వేరియంట్లపై పనిచేస్తోంది..!

తాజా అధ్యయనంలో వెల్లడి

మాస్కో: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు మాత్రం టీకాల పనితీరుకు ఓ సవాలుగా మారుతున్నాయి. ఇప్పటికే వినియోగిస్తోన్న టీకాలు కొన్ని వేరియంట్లను ఎదుర్కోగలుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. తాజాగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ కూడా కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లను తటస్థీకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు తొలుత వుహాన్‌లో వెలుగుచూసిన వైరస్‌ స్ట్రెయిన్‌ ఆధారంగా రూపొందించారు. కానీ, రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న వైరస్‌, ప్రమాదకర వేరియంట్లుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆల్ఫా, బీటా, గామాతో పాటు అత్యంత ప్రమాదకరమైందిగా భావిస్తోన్న డెల్టా వేరియంట్‌ను తటస్థీకరించడంలో స్పుత్నిక్‌-వి మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. ఇందుకోసం స్పుత్నిక్‌ టీకా తీసుకున్నవారి రక్త నమూనాలను సేకరించి పరిశీలించినట్లు తెలిపింది.

‘మిశ్రమ విధానం (Cocktail Approach)లో రెండు డోసులను భిన్న రకాలుగా తయారు చేయడంతో స్పుత్నిక్‌-వి అన్ని టీకాలలో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ విధానంతో రూపొందించిన స్పుత్నిక్‌-వి టీకా వల్ల ప్రేరేపితమయ్యే రోగనిరోధక ప్రతిస్పందనలు కొత్తగా వెలుగు చూస్తోన్న అన్ని వేరియంట్లను తటస్థీకరిస్తున్నట్లు గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ జరిపిన పరీక్షల్లో తేలింది. ఇది ఇతర వ్యాక్సిన్‌ల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోంది’ అని ఆర్‌డీఐఎఫ్‌ సీఈఓ కిరిల్‌ దిమిత్రివ్‌ పేర్కొన్నారు. సజీవ వైరస్‌లను వినియోగించి ఈ అధ్యయనం చేపట్టారని.. ఇది అత్యంత నమ్మకమైన, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సమాచారమని వెల్లడించారు. అంతేకాకుండా కొత్త వేరియంట్లపై ఇలాంటి అధ్యయనాలు మరిన్ని చేపడుతామని దిమిత్రివ్‌ స్పష్టం చేశారు.

భారత్‌లో 50 నగరాల్లో అందుబాటులో..

ఇక రష్యాలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (RDIF) రూపొందించిన స్పుత్నిక్‌-వి టీకా ఇప్పటికే దాదాపు 67దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లోనూ అనుమతి పొందిన స్పుత్నిక్‌, పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా పంపిణీ చేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో ఈ టీకాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, మిర్యాలగూడ, విశాఖపట్నం, విజయవాడలోనూ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. త్వరలోనే భారీ స్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని