కరోనా ఉద్ధృతి.. ఏ రాష్ట్రంలో ఎలా?

తాజా వార్తలు

Published : 24/03/2021 11:24 IST

కరోనా ఉద్ధృతి.. ఏ రాష్ట్రంలో ఎలా?

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. నానాటికీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 47వేల మందికి పైగా వైరస్‌ బారినపడ్డారు. ముఖ్యంగా మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం ఆయా రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి.

చెన్నైలో ఒకే కంపెనీలో..

తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ఐటీ కంపెనీ కరోనా క్లస్టర్‌గా మారింది. ఈ కంపెనీలో 40 మంది ఉద్యోగులకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఓ ఉద్యోగి అనారోగ్యానికి గురవడంతో పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కంపెనీలోని ఉద్యోగులందరికీ టెస్టులు చేయగా.. ఇప్పటివరకు 40 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఆ కంపెనీని తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.

కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా అంధేరీ

మహారాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ముంబయిలోని అంధేరీ(పశ్చిమ) కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ప్రాంతంలో రోజుకు 200 నుంచి 300 కొత్తకేసులు బయటపడుతున్నాయి. దీంతో అధికారులు జుహు బీచ్‌ను మూసివేసే యోచనలో ఉన్నారు. మరోవైపు వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా ముంబయి మహానగరంలో బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై బీఎంసీ నిషేధం విధించింది. అంతేగాక, వచ్చే రెండు వారాల్లో కొవిడ్‌ కేంద్రాల్లో పడకల సంఖ్యను పెంచనున్నారు.

ఒడిశాలో ఆంక్షలు..

ఒడిశాలోనూ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యపై ఆంక్షలు విధించింది. వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారి సంఖ్యను 200 మందికి పరిమితం చేసింది. అంత్యక్రియల్లోనూ 50 మందికి మించి పాల్గొనరాదని ఆదేశించింది.

మధ్యప్రదేశ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, భూపాల్‌ నగరాల్లో రోజుకు 300-400 కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఆదివారాలు లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేదంటే మళ్లీ గతేడాది పరిస్థితులు వస్తాయని ఆయన హెచ్చరించారు.

దిల్లీలో విస్తృత పరీక్షలు

దేశ రాజధాని దిల్లీలోనూ కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో అక్కడ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబరు 19 తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం మళ్లీ ఇప్పుడే. దీంతో దిల్లీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ల వద్ద విస్తృత కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చే ప్రయాణికులందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు వైరస్‌ ఉద్దృతి కారణంగా హోలీ, నవరాత్రి వేడుకలపై నిషేధం విధించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని