దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్‌

తాజా వార్తలు

Updated : 02/01/2021 11:54 IST

దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్‌

దిల్లీ: కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమానికి దేశంలో ముందడుగు పడిన వేళ నేడు టీకా డ్రైరన్‌ చేపట్టారు. దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్‌లో అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. దిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టీకా మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి డా. హర్షవర్ధన్‌ స్వయంగా వెళ్లి పరిశీలించారు. 

ఏంటీ డ్రైరన్‌..

వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ముందు ప్రజలు, ఆరోగ్యసిబ్బంది పాటించాల్సిన అంశాలు, టీకా ఇచ్చాక ఏవైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణం అందించాల్సిన చికిత్స గురించి డ్రైరన్‌ మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. టీకా లబ్ధిదారులు కేంద్రానికి వచ్చేలా సమీకరించడం, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వరుసల్లో నిలబెట్టడం, వారి నుంచి సమాచారాన్ని కొ-విన్‌ యాప్‌లో ప్రవేశపెట్టడం తదితర అన్ని దశలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. నేరుగా ఒక్క టీకా ఇవ్వడం తప్ప.. మిగిలిన అన్న ప్రక్రియలను అధికారులు పర్యవేక్షిస్తారు. ఇందులో ప్రధానంగా మూడు అంశాలపై ప్రదర్శన ఉంటుంది. 

మొదటిది: వేచిఉండు గదిలో ప్రవేశించిన తరువాత.. సిబ్బంది టీకా కోసం వచ్చినవారి పేరు, చిరునామా, వారి గుర్తింపు కార్డు పరిశీలిస్తారు. చేతుల శానిటైజ్‌ చేయిస్తారు. ప్రతి ఒక్కరికి మాస్కు తప్పనిసరి, మనిషి మనిషికి మధ్య ఆరుడుగుల దూరం ఉండేలా కూర్చోవాలి. 

రెండవది: టీకా ఇచ్చే గదిలోకి వెళ్లాక అభ్యర్థుల ప్రాథమిక సమాచారాన్ని తీసుకొంటారు. అనంతరం టీకా వేయడంపై మాక్‌డ్రిల్‌ చేస్తారు. 

మూడవది: టీకా తీసుకున్న తరువాత అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయోగశాల గదిలో 30 నిమిషాల పాటు ఉంచుతారు. టీకా తీసుకొన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఇంటికి పంపుతారు. ఒకవేళ సైడ్‌ఎఫెక్ట్స్‌‌ వస్తే.. అక్కడే సిద్ధంగా ఉన్న మందులతో తక్షణమే చికిత్స చేస్తారు. 

ఈ ప్రక్రియ అంతా వ్యాక్సినేషన్‌ సమయంలో సజావుగా సాగేలా సిబ్బందికి అవగాహన కల్పించడం కోసమే ఈ డ్రైరన్‌ చేపట్టారు. వ్యాక్సినేషన్‌ సమయంలో ఏ దశలోనైనా లోటుపాట్లు ఎదరైతే ప్రత్యేక పుస్తకంలో పొందుపరుస్తారు. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా నివేదిస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ టీకా పంపిణీలో అవసరమైన మార్పులు చేస్తుంది. 

కాగా.. దేశంలో టీకాను అతిత్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల బృందం పచ్చజెండా ఊపింది. ఈ టీకాకు షరతులతో కూడిన అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్ర సంస్థ(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. 

ఇవీ చదవండి..

టీకాకు ఓకే!

70లక్షల మందికి టీకాలివ్వడమే సవాల్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని