రాందేవ్‌పై చర్యలు తీసుకోండి: ప్రధానికి IMA లేఖ

తాజా వార్తలు

Updated : 26/05/2021 23:14 IST

రాందేవ్‌పై చర్యలు తీసుకోండి: ప్రధానికి IMA లేఖ

అసత్య ప్రచారాలను కట్టడి చేయాలని విజ్ఞప్తి

దిల్లీ: అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ వైద్య సంఘం (IMA) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అంతేకాకుండా వ్యాక్సినేషన్‌పై ఆయన చేస్తున్న అసత్య ప్రచారాలను వెంటనే ఆపే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఆధునిక వైద్యంపై రాందేవ్‌ చేస్తోన్న ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని.. వీటిని కట్టడి చేయాలని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది.

‘వ్యాక్సినేషన్‌పై పతంజలి అధినేత రాందేవ్‌ చేస్తున్న అసత్య ప్రచారాలను వెంటనే ఆపాలి. ఇందుకు ఆయనపై దేశద్రోహ చర్యలు చేపట్టాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత దాదాపు వెయ్యి మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారంటూ, అల్లోపతి ఔషధాలు తీసుకున్న లక్షల మంది చనిపోయారంటూ రాందేవ్‌ మాట్లాడినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందనీ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర ఆరోగ్యశాఖతో పాటు భారత వైద్య పరిశోధనా మండలి నియమావళి, మార్గదర్శకాల ప్రకారం, ఆసుపత్రులకు వచ్చే లక్షల మందికి చికిత్స చేస్తున్నామని ఐఎంఏ స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో అల్లోపతి వైద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయంటూ ఎవరైనా ప్రకటనలు చేయడం కేంద్ర ఆరోగ్యశాఖకు సవాల్‌ విసిరేందుకు ప్రయత్నించడమేనని అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే, ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్‌ బాబా 15 రోజుల్లోగా లిఖితపూర్వక క్షమాపణలు తెలియజేయాలని, లేదంటే రూ.1000 కోట్లు చెల్లించాలని ఐఎంఏ (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌) ఉత్తరాఖండ్‌ విభాగం ఆయనకు నోటీసులు పంపింది. దీంతోపాటు ఆయనసై సత్వర, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌కు లేఖ రాసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని