
తాజా వార్తలు
వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
మొసలి, పులి, హైనా, పాము, ఎలుగుబంటి, పట్టు పురుగులు, కోళ్లు, మేక, ఆవు, ఎలుకలు, బల్లి, గుడ్లగూబ, గుర్రం, చిలుకలు, కుక్కలు, పిల్లులు...
ఏంటివన్నీ? అడవిలోనో జంతు ప్రదర్శన శాలలోనే ఉండే జంతువులా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ పలువురు అమెరికా అధ్యక్షులు తమ పదవీ కాలంలో 18 ఎకరాల సువిశాలమైన శ్వేతసౌధంలో పెంచుకున్న జంతువులు మరి!
వాషింగ్టన్: అసలు అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు తప్ప మిగిలిన అందరూ ఏదో ఒక పెంపుడు జంతువును పెంచుకున్న వారే. 1860లో అధ్యక్షుడైన ఆండ్రూ జాన్సన్ తర్వాత పెంపుడు జంతువులు లేనిది ట్రంప్ హయాంలోనే అట. 2019నాటి గణాంకాల ప్రకారం.. అమెరికాలో సుమారు 67 శాతానికి పైగా కుటుంబాల్లో పెంపుడు జంతువులు ఉన్నాయి. ఇక కరోనా కాలంలో ఈ సంఖ్య 15 శాతం ఎక్కువైందట. ఇక అమెరికన్లకు పెంపుడు జంతువుల పట్ల మక్కువ ఎక్కువని వేరే చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో అధ్యక్షులతో పాటు శ్వేతసౌధంలో కొలువుతీరిన విచిత్రమైన పెంపుడు జంతువులను గురించిన సమాచారం ఇదిగో..
►♦ థామస్ జెఫర్సన్ (1801-09): రెండు కుక్కలు, గుర్రం, మాకిండ్ బర్డ్స్ అనే పిట్టలతో పాటు రెండు ఎలుగుబంట్లను కూడా పెంచుకున్నారు.
♦ జాన్ క్విన్సీ ఆడమ్స్ (1825-29): ఈయన సతీమణి లూసియా ఆడమ్స్ తమకు అవసరమైన పట్టు దుస్తుల కోసం పట్టుపురుగుల్నిపెంచేవారట. అంతే కాకుండా వీరు ఓ మొసలిని కూడా రెండు నెలల పాటు పెంచుకున్నారని అంటారు.
♦ మార్టిన్ వాన్ బురెన్ (1837-41): ఈ ఎనిమిదవ అధ్యక్షుడు ఒమాన్ సుల్తాన్ బహుమతిగా ఇచ్చిన రెండు పులి పిల్లలను పెంచుకున్నారు. అయితే కొంతకాలం అనంతరం వాటిని జూకు పంపేశారు.
♦ అబ్రహాం లింకన్ (1861-65): లింకన్‌కు అతి ప్రియమైన శునకం ఫిడో. దానితో పాటునానీ, నాంకో అనే మేకలు, జాక్ అనే టర్కీ కోడిని కూడా పెంచుకున్నారు. 1865లో ఈయన హత్యకు గురికాగా.. ఫిడోను కూడా ఆ తరువాతి ఏడాది ఎవరో చంపేశారట.
♦ ఆండ్రూ జాన్సన్ (1865-69): అగ్రరాజ్యానికి 17వ అధ్యక్షుడైన ఈయన.. తన బెడ్ రూంలో కనిపించిన తెల్ల ఎలుకలకు రోజూ ఆహారం పెట్టేవారట
♦ బెంజమిన్ హారిసన్ (1889-93): శునకాలు, మేకలతో పాటు ఈయన కుటుంబం శ్వేతసౌధంలోని సంరక్షణా కేంద్రంలో రెండు మొసళ్లను పెంచేవారట.
♦ థియోడర్ రూజ్వెల్ట్ (1858-1919): రూజ్వెల్ట్ హయాంలో అధ్యక్ష భవనం జూను తలపిస్తూ ఉండేదట. ఎలుగుబంటి, బల్లి, గినియా పందులు, హైనా (దుమ్ములగొండి), గుడ్లగూబ, నాలుగు పాములు లాంటి పెద్ద జాబితాయే ఈయన దగ్గర ఉండేదట.
♦ కాల్విన్ కూలిడ్జ్ (1923-29): పిల్లి మాదిరిగా కనిపించే రాకూన్‌ను పెంచుకున్నారు.
♦ జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ (1989-93):సీనియర్ బుష్ హయాంలో వైట్ హౌస్‌లో ఎన్నో శునకాలు ఉండేవి. వాటిలో మిల్లీ వారికి ఎంత ప్రియమైనదంటే.. ఆయన సతీమణి బార్బరా బుష్ దానిపై ఓ పుస్తకం కూడా రాసారట.
♦ జార్జ్ డబ్ల్యూ బుష్ (2001-09): జూనియర్ బుష్‌కు అత్యంత ప్రియమైన బార్నీ అనే స్కాటిష్ టెర్రియర్ జాతి శునకమంటే.. ఆయనతో సహా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణించేదట. అంతేకాకుండా ‘బార్నీ కామ్’ పేరుతో వెలువడ్డ పలు వీడియోలు జంతు ప్రేమికుల ఫేవరిట్‌గా నిలిచాయి.
♦ బరాక్ ఒబామా(2009-17): ఈయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో బో, సన్నీ అనే శునకాలను పెంచుకున్నారు.
ఇక ప్రస్తుతానికి వస్తే.. జో బైడెన్ పెంచుకుంటున్న ఛాంప్, మేజర్ వైట్‌హౌస్ చేరనున్నాయి. కాగా ఇవి రెండూ జర్మన్ షెపర్డ్ జాతికి చెందినవే. గోధుమ, నలుపు రంగుల్లో ఉండే ఛాంప్ 2008 నుంచి ఈ కుటుంబంలో భాగంకాగా, నలుపు-తెలుపుల్లో ఉండే మేజర్ డెలావేర్‌లోని డాగ్ షెల్టర్ (శునకాల శరణాలయం) నుంచి 2018లో వచ్చింది. శ్వేత సౌధంలోకి ఈ విధమైన రెస్కూ డాగ్ ఆగమనం ఇదే తొలిసారట. అధ్యక్ష ప్రమాణ స్వీకారం మాదిరిగా.. కొందరు ఔత్సాహికులు ఈ రెండింటికీ ‘ఇన్డాగ్యురేషన్’ను ఆన్లైన్లో జనవరి 17న జరపటం విశేషం. ఇక ఉపాధ్యక్షురాలు కానున్న కమలా హారిస్‌కు ప్రస్తుతానికి ఏ పెంపుడు జంతువులు లేవు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కుటుంబం- హేజెల్ అనే పిల్లిని, హర్లీ అనే కుక్కను, మార్లన్ బాండో అనే కుందేలునే కాకుండా సప్పిరా అనే పామును కూడా పెంచుకుంటోంది!
ఇదీ చదవండి..
ప్రమాణ స్వీకార విందు..ఏమున్నాయంటే..