
తాజా వార్తలు
కరోనా ఎఫెక్ట్: పెళ్లి మండపాల్లో మార్షల్స్
బెంగళూరు: గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పెళ్లి మండపాల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలను పాటించేలా వేడుకల వద్ద మార్షల్స్‌ను నియమించనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. వివాహాది శుభకార్యాలు, ఇతర సమావేశాల్లో ఎక్కువ మందిని అనుమతించేది లేదని, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన వెల్లడించారు.
వైరస్ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటకలోని కలబురగి జిల్లా యంత్రాంగం ప్రయాణ మార్గదర్శకాలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కలబురగి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ పత్రాన్ని చూపించాలని యంత్రాంగం స్పష్టం చేసింది. ఇందుకోసం సరిహద్దులో ఐదు చెక్ పాయింట్లు ఏర్పాటు చేసింది. ఇతర సరిహద్దుల్లోనూ ఇవే నిబంధనలను అమలు చేస్తోంది.