
తాజా వార్తలు
‘వాటిని తెరిచే ముందు మాకు టీకా ఇవ్వండి’
కేంద్రమంత్రిని కోరుతున్న సీబీఎస్ఈ విద్యార్థులు
దిల్లీ: సీబీఎస్ఈ పరీక్షలు రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు మార్చిలో, బోర్డు పరీక్షలు మేలో మొదలవుతున్నాయి. దీంతో సీబీఎస్ఈ పాఠశాలల పునఃప్రారంభం, పరీక్షలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకునే సీబీఎస్ఈ విద్యార్థులతో జనవరి 18న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి ట్వీట్ చేశారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్ష విధానంలో మార్పులు, ఆన్లైన్ తరగతుల్లో ఎదురైన ఇబ్బందులు, పరీక్షలపై కరోనా ప్రభావం తదితర అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు.
అయితే, కేంద్రమంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్లు ట్వీట్ చేయడంతో ట్విటర్ వేదికగా విద్యార్థులు నుంచి ప్రశ్నలు, విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదంతా ఆన్లైన్ తరగతులు జరిగాయని, వాటిల్లో ఇబ్బందులు ఎదురుకావడంతో సరిగా చదవలేకపోయామని వాపోయారు. పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేమని కొందరు విద్యార్థులు కామెంట్ చేస్తున్నారు. ‘‘జనవరి 18 నుంచి ఆన్లైన్ తరగతులు మూసివేస్తారా?పాఠశాలలు తెరిచి.. ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతులు రెండూ కొనసాగిస్తారా?ఇప్పట్లో మేం పాఠశాలలకు రావాలనుకోవట్లేదు. ఎందుకంటే మేం ఇంకా టీకా వేయించుకోలేదు. దయచేసి విద్యార్థులందరికీ టీకా వేయించండి’’అని ఒక విద్యార్థి కేంద్రమంత్రి ట్వీట్‌కి రీట్వీట్ చేశాడు.
విద్యార్థులందరికీ టీకా వేసే వరకు కేంద్రీయ విద్యాలయాలను తెరవొద్దని మరో విద్యార్థి ట్వీట్ చేశాడు. ‘ఏడాదంతా ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. అందులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయాం. కానీ, ప్రభుత్వం ఇవేవి పట్టించుకోవట్లేదు’అని మరో విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. మరికొందరు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి విద్యార్థుల ప్రశ్నలకు.. విజ్ఞప్తులకు కేంద్రమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి!