సర్జికల్‌ స్ట్రైక్స్‌ అందుకే..!

తాజా వార్తలు

Published : 25/02/2021 17:43 IST

సర్జికల్‌ స్ట్రైక్స్‌ అందుకే..!

 భద్రతా మండలిలో స్పష్టం చేసిన భారత్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడాన్ని ఆత్మరక్షణ చర్యగా ఐరాస భద్రతా మండలిలో భారత్‌ స్పష్టం చేసింది. ది ఆరియా ఫార్ములా మీటింగ్‌ విధానంలో మెక్సికో నిర్వహించిన ‘‘ఐరాస ఛార్టర్‌లోని సమష్టి భద్రతా వ్యవస్థను సమర్థించడం: బలప్రయోగంపై అంతర్జాతీయ చట్టం, సైనికేతర శక్తులు, ఆత్మరక్షణ’’ సదస్సులో భారత్‌ పాల్గొంది. ఈ సందర్భంగా ఐరాసలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్‌ నాయుడు మాట్లాడుతూ ‘‘ఏ దేశంపైన అయినా మరో దేశంలో నడుస్తున్న ఓ సైనికేతర సంస్థ భారీగా సాయుధ దాడి చేస్తే.. ఆ దేశం మరో దాడి జరగకుండా అడ్డుకొనేందుకు ముందస్తు దాడి చేయడానికి ఆదేశించవచ్చు. భద్రతా మండలిలోని 1368, 1373 తీర్మానాలు 9/11 వంటి ఉగ్రదాడులను అడ్డుకోవడానికి ఆత్మరక్షణ చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి’’ అని వివరించారు. 
‘‘కొన్ని దేశాలు ఉగ్రవాదుల వంటి సైనికేతర శక్తులకు ఆశ్రయం ఇస్తూ పరోక్ష యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికే ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నాయి. శిక్షణ, డబ్బు, ఇంటెలిజెన్స్‌ సమాచారం వంటివి అందించడంతోపాటు ఆయుధాలు కూడా సమకూరుస్తున్నాయి. పొరుగు దేశం చేస్తున్న పరోక్ష యుద్ధానికి, సీమాంతర ఉగ్రవాదానికి భారత్‌ లక్ష్యంగా మారుతోంది. 1993 ముంబయి పేలుళ్లు, 26/11లో ‘లోన్‌ ఉల్ఫ్‌’ దాడులు, ఇటీవల కాలంలో పఠాన్‌ కోట్‌, పుల్వామా దాడులు వీటికి సాక్ష్యంగా ఉన్నాయి. ఓ దేశంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు భారత్‌పై జరుపుతున్న దాడులను ప్రపంచం చూస్తోంది. సైనికేతర శక్తులు చేసే దాడి విషయంలో ఆత్మరక్షణ అనేది వర్తిస్తుంది. పొరుగు దేశ సార్వభౌమత్వాన్ని అడ్డం పెట్టుకొని దాడులు విషయంలో ఆత్మరక్షణకు ఎదురుగా ఉన్నది దేశమా, ఉగ్ర సంస్థ అనే విషయంతో  సంబంధం లేదు. ఉగ్రవాద సంస్థలు తరచూ దాడులు చేసినప్పుడు, వారికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఈ విషయం పట్టనట్లు వ్యవహరించి  నియంత్రణచర్యలకు విముఖత చూపినప్పుడు లేదా ఆ దేశమే ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినప్పుడు ఆత్మరక్షణకు బలప్రయోగం చేయవచ్చు’’ అని పాక్‌ను ఉద్దేశించి భారత ప్రతినిధి నాగరాజ్‌ నాయుడు ప్రకటించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని