Afghanistan: మీడియాపై ఉక్కుపాదం.. సంస్థలపై ‘11 నియమాలు’

తాజా వార్తలు

Updated : 26/09/2021 10:59 IST

Afghanistan: మీడియాపై ఉక్కుపాదం.. సంస్థలపై ‘11 నియమాలు’

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం మహిళల స్వేచ్ఛను హరించి వేసిన తాలిబన్లు.. వార్తా సంస్థలపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. మీడియా స్వేచ్ఛను అణచివేసేలా.. ‘11 నియమాలు’ పేరుతో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. మతానికి విరుద్ధంగా, ప్రభుత్వ పెద్దలను అవమానపరిచే కంటెంట్‌ను ప్రచురించకుండా ఉండేందుకు తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. ప్రభుత్వ మీడియా కార్యాలయాల సమన్వయంతో జర్నలిస్టులు వార్తలు, ఫీచర్ కథనాలు రాయాలని తాలిబన్లు హెచ్చరించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది.

తాలిబన్ల పాలన, వారి 11 నియమాలతో అఫ్గాన్‌లోని జర్నలిస్టులు భయపడిపోతున్నారని అమెరికాకు చెందిన పత్రికా స్వేచ్ఛ సంస్థ సీనియర్ సభ్యుడు స్టీవ్‌ బట్లర్‌ తెలిపినట్లు నివేదిక వెల్లడించింది. తమకు సాయం చేయాలంటూ జర్నలిస్టుల నుంచి ఆ సంస్థకు వందల సంఖ్యలో ఈమెయిళ్లు వస్తున్నట్లు తెలిపింది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం.. రోజువారీ వార్తలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న 150కి పైగా మీడియా సంస్థలు మూతపడినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. పలు ప్రముఖ వార్తాపత్రికలు సైతం ముద్రణ కార్యకలాపాలను నిలిపివేసి, ఆన్‌లైన్‌ ఎడిషన్లు మాత్రమే ఇస్తున్నాయని పేర్కొంది.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా, మీడియా హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన తాలిబన్ల మాటలు నీటి మూటలుగా మిగిలాయి. అనేక మంది విద్యార్థినులు తమ చదువులకు దూరమయ్యారు. ఎందరో మహిళలు ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి కోల్పోయారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించలేదు. ఆడవాళ్లు ఉన్నత పదవులు చేపట్టేంత సమర్థులు కారని, వారు పిల్లల్ని కంటే సరిపోతుందని చులకన చేసి మాట్లాడారు. తమ స్వేచ్ఛను హరించివేయకూడదంటూ రోడ్లపైకి చేరి గళమెత్తిన మహిళపై దాడులు చేశారు. ఈ వార్తలను కవర్‌ చేసిన జర్నలిస్టుపైనా దాడులకు పాల్పడ్డారు. వారితో క్షమాపణలు చెప్పించుకొని, శిక్షలు వేసి వదిలిపెట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని