Afghan Crisis: తాలిబన్ల అరాచకం.. కాబుల్‌లో భయం భయం

తాజా వార్తలు

Published : 21/08/2021 17:30 IST

Afghan Crisis: తాలిబన్ల అరాచకం.. కాబుల్‌లో భయం భయం

కాబుల్‌: తాలిబన్ల అరాచకాలు తట్టుకోలేక అఫ్గాన్‌ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. వాహనాలు వీధుల్లోకి వస్తున్న శబ్ధం వింటేనే చాలు భయంతో గజగజ వణికిపోతున్నారు. అవకాశం దొరికితే దేశం దాటి వెళ్లిపోయేందుకు ఎదురుచూస్తున్నారు. అటు, ప్రజల్ని హింసించిన వారు తమవారైనా చర్యలు తీసుకుంటామని తాలిబన్లు కంటితుడుపు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు, అఫ్గాన్‌లో చిక్కుకున్న అమెరికన్లు సహా వారికి సాయం చేసినవారందరినీ క్షేమంగా తరలిస్తామని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించిన నేపథ్యంలో వేలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక కథనం..

దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి మహిళలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. తాలిబన్లు గమనిస్తారనే భయంతో సామాజిక మాధ్యమాలను సైతం వారు ఉపయోగించడంలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. కాబుల్‌లోని ఓ అపార్టుమెంట్‌ వద్దకు తాలిబన్లు  రాగా.. ఆ సమయంలో 16మంది ఇంట్లో ఉన్నారు. లైట్లు, ఫోన్లు ఆఫ్‌ చేసి వారి కంటపడకుండా జాగ్రత్త తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లల ఏడుపు శబ్ధాలు సైతం వినబడకుండా భయంతో ఉండిపోయామన్నారు. వీధుల్లోంచి వాహనాలు వెళ్తున్న శబ్దాలు వింటేనే అందరం భయపడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆహార నిల్వలు కొద్దిగా ఉన్నాయని, ధరలు మాత్రం పెరిగిపోయి భయంకరపరిస్థితుల్లో ఉన్నామని వాపోతున్నారు. 

ఆహారం రుచిగా వండలేదనే కారణంతో ఓ మహిళకు తాలిబన్లు నిప్పంటించినట్టు అఫ్గాన్‌ మాజీ జడ్జి తెలిపారు. జిహాదీలను పెళ్లి చేసుకోవాలంటూ యువతులను బలవంతం చేస్తున్నారని, మహిళల్ని శవపేటికల్లో బంధించి.. ఇతర దేశాలకు తరలించి సెక్స్‌ బానిసలుగా మారుస్తున్నారని వెల్లడించారు.అఫ్గాన్‌లో మైనార్టీలుగా ఉన్న హజారాలపై తాలిబన్లు మళ్లీ ఉక్కుపాదం మోపుతున్నారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ వెల్లడించింది. ఘజ్నీ ప్రావిన్సులోని ముందరత్‌ గ్రామంలో గత నెల 4 నుంచి 6 తేదీ మధ్య తొమ్మిది మందిని చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్యచేసినట్టు వెల్లడించింది. కొందరు పోలీసులు, పాత్రికేయ సిబ్బంది సైతం తాలిబన్ల ఆగడాలకు బలైపోయారు.

మరోవైపు, అఫ్గాన్‌ వాసులను వేధిస్తున్నట్టు తమ దృష్టికివస్తే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాలిబన్లు కంటితుడుపు ప్రకటనలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన తాలిబన్లపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ అంశాలపై దర్యాప్తు చేస్తామని పేర్కొంటున్నారు. అధికారం చేపట్టాక ప్రతీకార దాడులకు దిగబోమని, మహిళా హక్కులకు భంగం కలిగించబోమని ఇదివరకే  తాలిబన్లు ప్రకటించినా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది. విమానాశ్రయాల చుట్టూ తాలిబన్లు పహారా కాస్తుండగా కాల్పుల్లో 12మంది చనిపోయారు. వారం రోజుల్లో 12వేల మంది విదేశీయులు,దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారు కాబుల్‌ నుంచి వెళ్లిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. అఫ్గాన్‌లో చిక్కుకున్న  అమెరికన్లు సహా వారికి ఇన్నాళ్లూ సాయం చేసిన కొందరు అఫ్గాన్‌ వాసులను కచ్చితంగా తమ దేశానికి తరలిస్తామని జో బైడెన్‌ హామీ ఇచ్చారు. కాబుల్‌ విమానాశ్రయంలో అమెరికా బలగాలకు ఎలాంటి అంతరాయం కలిగించొద్దని తాలిబన్లను హెచ్చరించారు. సైనిక విమానాలతో పాటు చార్టర్లు, ఇతర దేశాల విమాన రాకపోకలకు రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపారు. పౌరుల్ని సురక్షితంగా తరలించేందుకు 6వేల బలగాలు విమానాశ్రయంలో పహారా కాస్తున్నట్టు వెల్లడించారు. చరిత్రలో ఇది అత్యంత క్లిష్టమైన తరలింపు ప్రక్రియ అన్నారు. అటు, దేశం విడిచి వెళ్లేందుకు 10వేల మంది అఫ్గాన్‌ వాసులు, అమెరికా కోసం పనిచేసినవారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని