Tamil Nadu: సోమవారం నుంచి థియేటర్లు.. సెప్టెంబర్‌ 1నుంచి బడులకు గ్రీన్‌సిగ్నల్

తాజా వార్తలు

Published : 21/08/2021 20:35 IST

Tamil Nadu: సోమవారం నుంచి థియేటర్లు.. సెప్టెంబర్‌ 1నుంచి బడులకు గ్రీన్‌సిగ్నల్

చెన్నై: కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్రంలో విధించిన ఆంక్షలను తమిళనాడు ప్రభుత్వం అనేక సడలింపులతో మరోసారి పొడిగించింది. తొమ్మిది ఆ పైతరగతుల విద్యార్థులకు సెప్టెంబర్‌ 1 నుంచి భౌతికంగా తరగతులు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. అలాగే, సోమవారం నుంచి 50శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరుచుకొనేందుకు వీలు కల్పించింది. అయితే, సినిమా థియేటర్ల సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకొని ఉండాలని స్పష్టంచేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న కొవిడ్‌ ఆంక్షలను మరిన్ని సడలింపులతో సెప్టెంబర్‌ 9వరకు పొడిగిస్తున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వెల్లడించారు. 

బార్లు, హోటళ్లకూ అనుమతి
కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులు ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అందించవచ్చని తెలిపింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహించే అంశంపై సెప్టెంబర్‌ 15న సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కళాశాలలు, పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సెప్టెంబర్‌ 1నుంచి రొటేషన్‌ బేసిస్‌లో తెరుచుకోనున్నాయి. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంది. ఆయా కళాశాలల బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వ్యాక్సిన్‌ వేయించుకొనేలా ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.   రాష్ట్రంలో బార్‌లు, హోటళ్లు, క్లబ్‌లు తెరుచుకొనేందుకు సైతం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా సిబ్బంది కొవిడ్ టీకాలు వేయించుకోవాలని సూచించింది.  వీధి వ్యాపారులు, దుకాణదారులు వ్యాక్సిన్లు వేయించుకొనేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 

ఏపీకి బస్సులు రైట్‌..రైట్‌.. 

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా బొటానికల్‌, జూ పార్కులు తెరిచేందుకు అనుమతించింది. ఐటీ కంపెనీలు కూడా 100శాతం సిబ్బందితో పనిచేసేందుకు వీలు కల్పించింది. రాష్ట్రంలో ఈత కొలనలు కేవలం క్రీడాశిక్షణకు మాత్రమే పరిమితం చేసింది. రాష్ట్రంలో దుకాణాలు తెరిచి ఉంచేందుకు మరో గంట పాటు సడలింపు ఇచ్చారు. గతంలో రాత్రి 9గంటల వరకు గడువు ఉండగా.. ప్రస్తుతం దాన్ని రాత్రి 10గంటల పొడిగించారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు నడిపేందుకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని