
తాజా వార్తలు
భారత్లో మోడెర్నా టీకా: టాటా ప్రయత్నాలు!
సీఎస్ఐఆర్ జట్టుకట్టనున్నట్లు సమాచారం
ముంబయి: భారత్లోకి మోడెర్నా కరోనా వైరస్ టీకాను తీసుకువచ్చేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి మెడెర్నా సంస్థతో టాటా మెడికల్ అండ్ డయోగ్నస్టిక్స్ చర్చలు జరుపుతోందని సమాచారం.
ఆక్స్ఫర్డ్ టీకా కొవిషీల్డ్, భారత్ బయోటెక్ టీకా కొవాగ్జిన్లను కేంద్రం ఇప్పటికే అత్యవసర వినియోగం కింద పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్లో మోడెర్నా టీకాకు క్లినికల్ ప్రయోగాలు నిర్వహించేందుకు టాటా మెడికల్ అండ్ డయోగ్నస్టిక్స్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి(సీఎస్ఐఆర్)తో జట్టుకట్టనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ వార్తలపై మోడెర్నా, టాటా సంస్థల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.
ఇదిలా ఉండగా..నవంబర్లో విడుదలైన తుది దశ ప్రయోగ ఫలితాల్లో మోడెర్నా 94.1 శాతం సమర్థవంతమైందని వెల్లడైంది. అలాగే ప్రయోగాల సమయంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తలేదని సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ టీకాను అమెరికా, ఐరోపా దేశాలు అనుమతించి పంపిణీ చేస్తున్నాయి.
ఇవీ చదవండి:
ఆస్ట్రేలియాలో కరోనా టీకాకు ఓకే
రికవరీలు, కొత్త కేసులు..13వేల పైనే