మీ అమ్మకు చెప్పు.. నేను సీఎం అవుతానని
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ అమ్మకు చెప్పు.. నేను సీఎం అవుతానని

30ఏళ్ల కిందటే ఇష్టపడిన అమ్మాయికి చెప్పిన హిమంత

గువాహటి: ఆ అబ్బాయి వయసు 22ఏళ్లు.. అమ్మాయికి 17ఏళ్లు. తొలి చూపులోనే అతను ఆమెను ఇష్టపడ్డాడు. అదే మాట ఆమెకి చెబితే.. ‘‘భవిష్యత్తులో ఏం ఉద్యోగం చేస్తాడని ఇంట్లో అడిగితే ఏం చెప్పను’’ అంది ఇష్టాన్ని పరోక్షంగా వ్యక్తపరుస్తూ..! అప్పుడు ఆ యువకుడు ఏ మాత్రం తడుముకోకుండా  ‘‘మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినవుతా’’ అని అన్నాడట..! 30ఏళ్ల క్రితం ఓ జంట మధ్య జరిగిన సంభాషణ ఇదీ. ఆ అబ్బాయి మరెవరో కాదు.. అస్సాం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ. ఆ అమ్మాయే.. పదేళ్ల తర్వాత తాను పెళ్లాడిన రినికి భుయాన్‌. హిమంత సీఎం అయిన సందర్భంగా ఆనాటి సంగతులను పంచుకున్నారు ఆయన సతీమణి. అది ఆమె మాటల్లోనే..

‘‘నేను ఆయన(హిమంత)ను తొలిసారి కలిసినప్పుడు నా వయసు 17ఏళ్లు. ఆయనకు 22ఏళ్లు. నీ భవిష్యత్తు గురించి ఇంట్లో ఏం చెప్పాలి అని నేను ఆయనను అడిగాను. అప్పుడు ఆయన చెప్పింది ఒక్కటే.. ‘ఒక రోజు అస్సాంకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పు’ అన్నారు. ముందు నేను ఆశ్చర్యపోయినా.. నేను పెళ్లిచేసుకోవాలనుకునే వ్యక్తికి కచ్చితమైన లక్ష్యం ఉందని నాకు అర్థమైంది.  రాష్ట్రానికి ఏదో చేయాలనే కాంక్ష ఉందని తెలిసింది. మా పెళ్లి జరిగేనాటికి ఆయన ఎమ్మెల్యే. ఆ తర్వాత మంత్రి అయ్యారు. రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే నమ్మలేకపోయా. అంతకు ముందు రోజు రాత్రి ఆయన ఇంటికి వచ్చి మాటల మధ్యలో ‘కాబోయే సీఎం’ అన్నారు. ఎవరు..? అని అడిగా.. ఇంకెవరూ ‘నేనే’ అని చెప్పారు. చాలా సంతోషంగా అన్పించింది.’’

‘‘చదువుకునేప్పటి నుంచి ఆయన చాలా ఫోకస్డ్‌గా ఉండేవారు. భవిష్యత్తులో ఏం చేయాలనేదానిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజాజీవితంలో ఉండే వ్యక్తికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది మాకు తెలుసు. కానీ, వాటిని ఆయన సమర్థంగా పరిష్కరించగలడన్న నమ్మకం నాకుంది. మెదడుతోనూ, మనసుతోనూ ఆలోచించే వ్యక్తి ఆయన. చివరగా ఒక్క మాట.. ఆయన ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావొచ్చు.. కానీ నాకు మాత్రం ఎప్పటికీ హిమంతనే’’ అని ఆనందంగా చెప్పుకొచ్చారు రినికి భుయాన్‌ శర్మ.

52ఏళ్ల హిమంత గువాహటిలోని కాటన్‌ కాలేజీలో డిగ్రీ, పీజీ చదివారు. అక్కడే రినికి పరిచయమయ్యారు. పదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు పెద్దల అంగీకారంతో 1991 మే నెలలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. రినికి ప్రస్తుతం మీడియా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వ్యవహరిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని