Aryan Khan Case: సమీర్‌ వాంఖడేను అందుకే టార్గెట్‌ చేసుకున్నారు..!

తాజా వార్తలు

Published : 25/10/2021 01:37 IST

Aryan Khan Case: సమీర్‌ వాంఖడేను అందుకే టార్గెట్‌ చేసుకున్నారు..!

ఆయనకు రక్షణ కల్పించాలన్న కేంద్రమంత్రి రాందాస్‌ అఠవాలే

దిల్లీ: ఆర్యన్‌ ఖాన్‌ కేసును దర్యాప్తు జరుపుతోన్న ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి రాందాస్‌ అఠవాలే స్పందించారు. ఆయనపై వస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి.. మహారాష్ట్ర ప్రభుత్వానివి దుర్మార్గమైన చర్యలని అన్నారు. కేవలం సమీర్‌ వాంఖడే వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే ఆయనను మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. వాంఖడే ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వానిదేనని అఠవాలే స్పష్టం చేశారు.

‘సమీర్‌ వాంఖడే బీసీ వర్గానికి చెందిన అధికారి. అంతేకాకుండా నవామ్‌ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ అధికారులు గతంలో అరెస్టు చేశారు. అందుకే నవాబ్‌ మాలిక్‌ వాంఖడేను లక్ష్యంగా చేసుకున్నారు. వాంఖడే మాత్రం ఆయన డ్యూటీ చేస్తున్నారు’ అని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నేత, కేంద్ర మంత్రి రాందాస్‌ అఠవాలే పేర్కొన్నారు. ఇక ఆర్యన్‌ ఖాన్‌ కేసు విషయానికొస్తే.. డ్రగ్స్‌ కేసులో భాగస్వామ్యమైనట్లు ఆధారాలు లభించడం వల్లే న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు.

ఇక నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(NCB) ముంబయి యూనిట్‌కు జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్న సమీర్‌ వాంఖడే నేతృత్వంలో ముంబయి క్రూజ్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, దర్యాప్తు జరుపుతున్నప్పటి నంచి ఆయనపై ఎన్‌సీపీకి చెందిన నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు చేస్తున్నారు. అసలు డ్రగ్స్‌ వ్యవహారమే అసత్యమన్న ఆయన.. బాలీవుడ్‌ స్టార్ల నుంచి సమీర్‌ వాంఖడే డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆయన ఉద్యోగం ఊడుతుందని.. జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్‌ను ఈ ఏడాది జనవరిలో ఎన్‌సీబీ అరెస్టు చేసింది. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా ఎన్‌సీబీ మరోసారి ప్రముఖ నటుడి కుమారుడిని అరెస్టు చేయడంతో మహారాష్ట్ర మంత్రి ఆరోపణలు మొదలుపెట్టారు. కేవలం మంత్రి అల్లుడిని అరెస్టు చేసినందునే ఎన్‌సీబీ అధికారిపై ఆరోపణలు చేస్తున్నారని తాజాగా కేంద్ర మంత్రి విమర్శించారు. అయితే, తమ సంస్థపై వస్తోన్న ఆరోపణలను ఎన్‌సీబీ ఖండిస్తోంది. కేవలం దర్యాప్తు సంస్థ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని