Bihar: ఆరో తరగతి విద్యార్థుల ఖాతాల్లో.. రూ.900 కోట్లు..!

తాజా వార్తలు

Updated : 17/09/2021 12:44 IST

Bihar: ఆరో తరగతి విద్యార్థుల ఖాతాల్లో.. రూ.900 కోట్లు..!

అసలు ఏం జరిగిందంటే..?

పట్నా: ఆరవ తరగతి చదువుతోన్న ఇద్దరు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో కోట్ల కొద్ది డబ్బు దర్శనమిచ్చింది. రాత్రికి రాత్రే అంత డబ్బు పడిందని తెలియడంతో మిగతా గ్రామస్థులు ఏటీఎంల వద్దకు బారులు తీరారు. కానీ తమకేం అలాంటి మ్యాజిక్ జరగలేదని గ్రహించి ఉసూరుమంటూ ఇంటికి తిరిగివచ్చారు. ఇప్పుడు ఈ విషయం బిహార్‌లోని కథిహార్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే..!

పాఠశాల యూనిఫాం, ఇతర ఖర్చుల నిమిత్తం బిహార్ ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో కొంత మొత్తం జమచేస్తుంది. ఆ పథకం కింద తమకు డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు కొందరు విద్యార్థులు ఇంటర్నెట్‌ కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో కోట్ల కొద్ది డబ్బు జమ అయినట్లు తెలిసింది. ఆరవ తరగతి చదువుతోన్న ఆశిశ్‌ ఖాతాలో రూ.6.2 కోట్లు, మరో విద్యార్థి గురు చరణ్ విశ్వాస్ ఖాతాలో రూ.900 కోట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే విషయం ఊరంతా పాకింది. తమ ఖాతాల్లో కూడా అలాంటి మ్యాజిక్ ఏమైనా జరిగిందేమోనని తెలుసుకునేందుకు గ్రామస్థులు ఏటీఎంల వద్దకు బారులు తీరారు. అలాంటిదేమీ లేదని తెలిసి, దిగాలుగా వెనక్కి వచ్చారు. ఈ వ్యవహారం సంబంధిత బ్యాంకు సిబ్బంది వద్దకు చేరింది. 

‘ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయిందనే సమాచారం అందింది. పొద్దున్నే బ్యాంకు శాఖలో ఖాతాలను పరిశీలించాం. సాంకేతికంగా తలెత్తిన అంతరాయం కారణంగా.. ఆ ఖాతాల్లో డబ్బు ఉన్నట్లు చూపిందని మేనేజర్ తెలిపారు. వాస్తవంలో ఖాతాల్లో ఆ డబ్బు లేదు. దీనిపై బ్యాంకు నుంచి నివేదిక తీసుకుంటాం’ అని కథియార్ జిల్లా కలెక్టర్ మీడియాకు తెలిపారు. 

ఈ తరహాలో బిహార్‌లో వెలుగుచూసిన రెండో ఉదంతమిది. ఇదివరకు ఆ రాష్ట్రంలోని ఖాగడియా జిల్లా భక్తియార్‌పుర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్‌కు చెందిన బ్యాంకు ఖాతాలో రూ.5.5లక్షలు జమయ్యాయి. పొరపాటున పడిన ఆ సొమ్మును రంజిత్ వాడేశారు. బ్యాంకు అధికారులు ఆ డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నించగా..ఆ వ్యక్తి నిరాకరించారు. దాంతో జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని