China: భారీ వరదలు.. తేలియాడిన కార్లు

తాజా వార్తలు

Updated : 21/07/2021 13:44 IST

China: భారీ వరదలు.. తేలియాడిన కార్లు

హెనన్‌ ప్రావిన్స్‌లో 1000ఏళ్లలో భారీ వర్షం

బీజింగ్‌: చైనాలోని హెనన్‌ ప్రావిన్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 1000ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురవడంతో భీకర వరదలు సంభవించాయి. ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు కనీసం 12 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

హెనన్‌ ప్రావిన్స్‌.. అనేక వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక. చైనా అతిపెద్ద ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ కూడా ఇక్కడే ఉంది. ఈ రాష్ట్రంలో గత శనివారం నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ‘ఐఫోన్‌ సిటీ’గా పిలిచే ప్రావిన్స్‌ రాజధాని జెంగ్జౌలో మంగళవారం ఒక్కరోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి ఇక్కడ సగటున 640.8 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 1000ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని అక్కడి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాలతో ఈ ప్రావిన్స్‌ను ఆనుకుని ఉన్న ఎల్లో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలోకి వెళ్లాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉండాల్సిన కార్లు నీటిపై పడవల్లా తేలియాడుతున్నాయి. ఇప్పటికే అనేక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. హెనన్‌ వ్యాప్తంగా అనేక జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. జెంగ్జౌకు పశ్చిమాన ఉన్న యిహెతన్‌ డ్యామ్‌ ఏ క్షణానైనా కూలేలా ఉన్నట్లు తెలుస్తోంది. 

రైల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు..

వరదల కారణంగా ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. జెంగ్జౌలో లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బస్సు, రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. 250కి పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. జెంగ్జౌలోని ఓ సబ్‌వే టన్నెల్‌లోకి వరద నీరు భారీగా చేరడంతో అందులో నుంచి వెళ్తోన్న రైల్లోకి నీరు వచ్చింది. అనేక మంది రైల్లో చిక్కుకుపోయారు. ఛాతీ వరకు నీటిలో నిల్చున్న ప్రయాణికుల వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సహాయకచర్యలు చేపట్టిన అధికారులు ప్రయాణికులను టన్నెల్‌ నుంచి బయటకు తీసుకొస్తున్నారు.





Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని