Medical expenses: తక్షణ వైద్య ఖర్చులను బీమా సంస్థలు పెట్టుకోలేవా?

తాజా వార్తలు

Updated : 28/10/2021 10:15 IST

Medical expenses: తక్షణ వైద్య ఖర్చులను బీమా సంస్థలు పెట్టుకోలేవా?

విద్యార్థుల లేఖనే దావాగా స్వీకరించిన కేరళ హైకోర్టు

కోచి: ప్రమాదంలో గాయపడ్డవారి తక్షణ చికిత్సలకు అవసరమయ్యే ఖర్చులను బీమా సంస్థలు పెట్టుకోలేవా? అనే అంశాన్ని కేరళ హైకోర్టు పరిశీలన జరపనుంది. ఈ విషయమై విద్యార్థులు రాసిన లేఖనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. కేసు పూర్వపరాలను పరిశీలిస్తే...ఇడుక్కి జిల్లా కుట్టికనంలోని మరియన్‌ ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ సంస్థలో చదివే విద్యార్థి ఒకరు ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కూలీలైన తల్లిదండ్రులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ సీటీ స్కాన్‌ వంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఇందుకు దాదాపు రూ.లక్ష వరకు ఖర్చయింది. కరోనా సమయంలో ఇది జరగడంతో సొమ్ము సమకూర్చడం వారికి కష్టంగా మారింది. ఇలాంటి సందర్భాల్లో బీమా కంపెనీలు తక్షణమే సొమ్ము సమకూర్చి, అనంతరం చెల్లించే పరిహారంలో దానిని మినహాయించుకుంటే బాగుంటుందని సూచిస్తూ ఆ కళాశాల విద్యార్థులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సునీల్‌ థామస్‌కు లేఖ రాశారు. ఇది బుధవారం జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్, జస్టిస్‌ సి.జయచంద్రన్‌ల ధర్మాసనం పరిశీలనకు వచ్చింది. దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన న్యాయమూర్తులు వచ్చే వారం తగిన ధర్మాసనానికి కేటాయిస్తామని తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి 48 గంటల్లో అత్యవసర చికిత్సల నిమిత్తం పాలసీ ఉండాలని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించినా బీమా కంపెనీలు అందుకు అంగీకరించలేదని విద్యార్థులు తమ లేఖలో తెలిపారు. ప్రమాద బాధితుల వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని గతంలో కేరళ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించినా అమల్లోకి రాలేదని పేర్కొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని