Afghan crisis: అన్ని దేశాలు.. మల్లగుల్లాలు

తాజా వార్తలు

Updated : 18/08/2021 11:59 IST

Afghan crisis: అన్ని దేశాలు.. మల్లగుల్లాలు

అఫ్గాన్‌ తాజా పరిస్థితులపై ఉన్నతస్థాయిలో మంతనాలు
కాబుల్‌ నుంచి ప్రజలను తరలించడంపై దృష్టి
తాలిబన్లకు వత్తాసుగా పాక్, చైనా, రష్యా వ్యాఖ్యలు

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో... గంటల వ్యవధిలోనే పరిస్థితులు తారుమారయ్యాయి. తాజా రాజకీయ పరిస్థితులను ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లో చిక్కుకున్న తమ దౌత్య సిబ్బందిని వెనక్కు రప్పించేందుకు ప్రత్యేక విమానాలను పంపుతున్నాయి. తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో- ఇప్పటివరకూ విదేశీ బలగాలకు సహాయకులుగా పనిచేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దేశం విడిచి వెళ్లడమే శరణ్యమని, లేకుంటే తాలిబన్ల చేతిలో చిత్ర హింసలకు గురికావాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. తమను కూడా తీసుకువెళ్లిపోవాలంటూ ఆయా దేశాల అధికారులకు మొరపెడుతున్నారు.

సమ్మిళిత రాజకీయ పరిష్కారంతోనే..
ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పలు దేశాల ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీతో మంగళవారం బ్లింకెన్‌ మాట్లాడారు. సమ్మిళిత రాజకీయ ముగింపుతోనే అఫ్గాన్‌ సమస్యకు ఉత్తమ పరిష్కారం కనుగొనవచ్చని ఖురేషీ పేర్కొన్నారు. అమెరికాలో పాకిస్థాన్‌ రాయబారి అక్రమ్‌ మాట్లాడుతూ... ‘‘సైనిక చర్యతో అఫ్గాన్‌ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. సమ్మిళిత రాజకీయ పరిష్కారంతోనే ఆ దేశంలో దీర్ఘకాల శాంతి భద్రతలు, అభివృద్ధి సాధ్యమవుతాయి. ఇందుకు అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలి’’ అని పేర్కొన్నారు.

తాలిబన్ల చర్యను స్వాగతించిన రష్యా!
మాస్కో: అఫ్గాన్‌లో తాలిబన్ల దురాక్రమణను రష్యా స్వాగతించింది. స్వయానా రష్యా సుప్రీంకోర్టు ఉగ్రవాద సంస్థగా గుర్తించిన తాలిబన్‌తో కలిసి పనిచేస్తామన్న సంకేతాలిచ్చింది! అష్రఫ్‌ ఘనీ సర్కారును తాలిబన్లు కూల్చివేయడం పట్ల అఫ్గాన్‌లోని రష్యా రాయబారి దిమిత్రి జిర్నోవ్‌ స్పందించారు. ‘‘కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం సరైనదే. అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వంలో కంటే, తాలిబన్ల నియంత్రణలోనే కాబుల్‌లో పరిస్థితులు బాగున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రశాంతత నెలకొంది’’ అని పేర్కొన్నారు.

ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామం కాకూడదు: చైనా హెచ్చరిక
బీజింగ్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ సంస్థ సమ్మిళిత ఇస్లామిక్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సోమవారం ఆశాభావం వ్యక్తం చేసిన చైనా... మంగళవారం తాలిబన్లకు హెచ్చరిక కూడా జారీ చేసింది! ఉగ్రవాద సంస్థలకు మరోసారి అఫ్గానిస్థాన్‌ స్వర్గధామం కాకుండా చూడాల్సిన బాధ్యత తాలిబన్లపై ఉందని పేర్కొంది. కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న క్రమంలో ఐరాస భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశానికి చైనా శాశ్వత ప్రతినిధి జెంగ్‌ షుయాంగ్‌ పాల్గొన్నారు. ‘‘అఫ్గాన్‌లో రాజకీయ పరిష్కారం కనుగొనేటప్పుడు తప్పనిసరిగా ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇస్లామిక్‌ స్టేట్, అల్‌-ఖైదా, ది ఈస్ట్‌ తుర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ (ఈటీఐఎం) తదితర ఉగ్రవాద సంస్థలకు అఫ్గాన్‌ స్వర్గధామం కాకుండా చూడాలి’’ అని ఈ సందర్భంగా షుయాంగ్‌ పేర్కొన్నారు.

మానవతా సాయం పెంచనున్న బ్రిటన్‌
లండన్‌: అఫ్గానిస్థాన్‌కు తాము అందిస్తున్న మానవతా సాయాన్ని 10% మేర పెంచనున్నట్టు బ్రిటన్‌ వెల్లడించింది. ఈ మొత్తాన్ని అఫ్గాన్‌లోని సామాన్యులకు అందేలా చూస్తామని, తాలిబన్లకు వాటిని చిక్కనివ్వమని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌ తెలిపారు. అఫ్గాన్‌ శరణార్థుల నిమిత్తం ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని, త్వరలోనే దీనిపై ప్రధాని బోరిస్‌ జాన్సన్, అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి ప్రీతి పటేల్‌ చర్చిస్తారని వెల్లడించారు.

ప్రజలను తరలించలేకపోతున్నాం: మారిసన్‌
కాన్‌బెర్రా: కాబుల్‌ నుంచి అఫ్గాన్‌ ప్రజలను అధిక సంఖ్యలో తరలించలేమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ వెల్లడించారు. కాబుల్‌కు మూడు రవాణా విమానాలను పంపిన ఆస్ట్రేలియా... అక్కడి నుంచి తమ దేశానికి చెందిన 130 కుటుంబాలను తరలించింది. ఆస్ట్రేలియా దళాలతో కలిసి వేల మంది అఫ్గాన్‌ ప్రజలు ఏళ్ల తరబడి పనిచేశారు. ‘మమ్మల్ని కూడా మీతో పాటే తీసుకువెళ్లండి’ అని ఇప్పుడు వారంతా ఆస్ట్రేలియా అధికారులను వేడుకుంటున్నారు.

జర్నలిస్టులకు భద్రత కల్పించాలి
న్యూయార్క్‌: అఫ్గాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్న క్రమంలో- అక్కడి విలేకరుల భద్రతపై ‘కమిటీ టూ ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (పీపీజే)’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొద్దిరోజుల కిందట భారత ఫొటో జర్నలిస్ట్‌ దానిష్‌ సిద్ధిఖీ... తాలిబన్ల చేతిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్ల పాలనలో పాత్రికేయులకు భద్రత లేదని, అమెరికా ప్రత్యేక బాధ్యత తీసుకుని అక్కడి జర్నలిస్టులకు అత్యవసరంగా వీసాలు జారీచేయాలని కోరింది. స్వతంత్ర పాత్రికేయులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

అఫ్గాన్ల రక్షణపై అమెరికా దృష్టి
వాషింగ్టన్‌: అఫ్గాన్‌లో తమ దళాలకు సాయపడిన అఫ్గాన్లకు రక్షణ కల్పించడంపై అమెరికా దృష్టి సారించింది. దుబాసీలు తదితర 22 వేల మందికి తమ సైనిక స్థావరాల్లో ఆశ్రయం కల్పించడంపై దృష్టి సారించింది.

సాయం నిలిపేసిన జర్మనీ
బెర్లిన్‌: అఫ్గాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం అందజేస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్టు జర్మనీ ప్రకటించింది. ఇప్పుడు ఆ దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినందున నిధులను నిలిపివేస్తున్నామని పేర్కొంది.

కాఠ్‌మాండూకు భారతీయులు
పారిస్, కాఠ్‌మాండూ: కాబుల్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో పనిచేసిన 9 మంది భారతీయులు, 118 మంది నేపాలీయులు మంగళవారం ఖతార్‌కు చెందిన విమానంలో దోహా మీదుగా కాఠ్‌మాండూ చేరుకున్నారు. మరోవైపు- మంగళవారం తెల్లవారుజామున కాబుల్‌కు ప్రత్యేక సైనిక విమానం పంపిన ఫ్రాన్స్, అక్కడి నుంచి పలువురిని సురక్షితంగా తమ ప్రాంతానికి తరలించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని