తప్పుడు సమాచారంతో జనాన్ని చంపేస్తున్నారు!

తాజా వార్తలు

Published : 18/07/2021 17:55 IST

తప్పుడు సమాచారంతో జనాన్ని చంపేస్తున్నారు!

సామాజిక మాధ్యమాలపై బైడెన్‌ వ్యాఖ్య

వాషింగ్టన్‌: కరోనాపై తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా సామాజిక మాధ్యమాలు జనాన్ని చంపేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. టీకాలపై దుష్ప్రచారం చేస్తున్న ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలకు మీరేమైనా సందేశం ఇస్తారా అని బైడెన్‌ను విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘‘వారు ప్రజల్ని చంపేస్తున్నారు. టీకాలు వేసుకోకపోవడమే ఇప్పుడు పెద్ద వ్యాధిగా మారింది’’ అని అన్నారు. అమెరికా సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తి గురువారం విలేకరులతో మాట్లాడుతూ టీకాలపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఆయా సంస్థలే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి ఏర్పాట్లు ఉన్నాయే తప్ప, అరికట్టడానికి లేవని అన్నారు. అయితే ఈ వాదనను ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి డానీ లీవర్‌ అంగీకరించలేదు. ఫేస్‌బుక్‌లో కరోనాపై ఇచ్చిన అధికారిక సమాచారాన్ని 200 కోట్ల మంది చూశారని తెలిపారు. ఒక్క అమెరికాలోనే టీకా కేంద్రాల వివరాలను 30.3 లక్షల మంది పరిశీలించారని చెప్పారు. ప్రాణాలు కాపాడడానికి ఫేస్‌బుక్‌ కృషి చేస్తున్నట్టు ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయని వివరించారు. మరో సామాజిక మాధ్యమం ట్విటర్‌ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ రూపాంతరం చెందుతోందని, దీని అధీకృత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని పేర్కొంది.

మరో క్వాడ్‌ కూటమి ఏర్పాటు 

అమెరికా మరో మూడు దేశాలతో కలిసి ఇంకో ‘క్వాడ్‌’ కూటమిని ఏర్పాటు చేసింది. ఇప్పటికే జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లతో కలిసి ‘క్వాడ్‌’ను నెలకొల్పింది. తాజాగా అమెరికా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు కలిసి కొత్త ‘క్వాడ్‌’గా ఏర్పాటయ్యాయి. నాలుగు దేశాలు కలిసి ‘చతుర్భుజ కూటమి’ (క్వాడిలేటరల్‌-క్వాడ్‌)గా ఏర్పాటు కావడంతో దౌత్యవర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకొంది. అఫ్గానిస్థాన్‌లో దీర్ఘకాలిక శాంతి, సుస్థిరత నెలకొనాలంటే ప్రాంతీయ సంబంధాలు ముఖ్యమని శుక్రవారం అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. చరిత్రాత్మక ‘సిల్క్‌ రోడ్‌’లో గుండెకాయలా ఉన్న అఫ్గానిస్థాన్‌ చుట్టూ ఇరాన్, తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, చైనా, పాకిస్థాన్‌లు ఉన్నాయి. అసియా, ఐరోపా ఖండాలను అనుసంధానించే మార్గంలో అఫ్గాన్‌ కీలకంగా వ్యవహరించనుంది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బెల్ట్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) పరిధిలోకి అఫ్గాన్‌ను తీసుకురావాలని చైనా భావిస్తోంది. దానికి ప్రతిగా అమెరికాయే క్వాడ్‌కు రూపకల్పన చేసి, మౌలిక వసతుల రూపకల్పనపై దృష్టి పెట్టనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని