Biden: ప్రాణనష్టం తప్పక పోవచ్చు.. కష్టమైనా కాబుల్‌ నుంచి ప్రజలను తరలిస్తాం: బైడెన్‌

తాజా వార్తలు

Updated : 22/08/2021 12:48 IST

Biden: ప్రాణనష్టం తప్పక పోవచ్చు.. కష్టమైనా కాబుల్‌ నుంచి ప్రజలను తరలిస్తాం: బైడెన్‌

మా బలగాలను ప్రమాదంలోకి నెట్టి మరీ ఈ ప్రక్రియ చేపడుతున్నాం

చేపట్టిన పని పూర్తికాకుండా అఫ్గాన్‌ను విడిచేది లేదు

వాషింగ్టన్‌: కాబుల్‌ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని, ప్రాణనష్టం లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అయినప్పటికీ, తాలిబన్‌ ఆక్రమిత అఫ్గాన్‌ నుంచి అమెరికన్లను, మిత్రదేశాల వారిని తరలిస్తామని అభయమిచ్చారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఈనెల 31లోగా తన బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్దేశించుకుంది. జులై నుంచి ఇప్పటివరకూ 18 వేల మందిని తరలించింది. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించినా, అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ఇప్పటికీ అమెరికా బలగాల స్వాధీనంలోనే ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో, అమెరికా, మిత్రదేశాల వారూ... విదేశీ బలగాలతో కలిసి పనిచేసిన అఫ్గాన్లు భారీగా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అయితే, ధ్రువపత్రాల పరిశీలన జాప్యం కావడంతో తరలింపు ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ విషయంలో అమెరికా తీరు పట్ల విమర్శలు రావడంతో బైడెన్‌ శనివారం శ్వేతసౌధం వద్ద మాట్లాడారు.

‘‘అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కాబుల్‌ నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించే సామర్థ్యం ఈ ప్రపంచంలో ఒక్క అమెరికాకే ఉంది. మా పౌరులతోపాటు మిత్రదేశాలకు చెందిన సుమారు 65 వేల మందిని కూడా తరలిస్తాం. అయితే, ముందు అమెరికన్లకు ప్రాధాన్యమిస్తాం. చాలా సమస్యాత్మక పరిస్థితుల్లో, మా సాయుధ బలగాలను ప్రమాదంలోకి నెట్టి మరీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు 
సాధ్యమైనన్ని వనరులను రంగంలోకి దించుతాం. ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సి ఉంది. అయినా నష్టం తప్పకపోవచ్చు!

విదేశీ విమానాలకూ వెసులుబాటు...

కాబుల్‌ విమానాశ్రయంలో సుమారు 6 వేల మంది అమెరికన్‌ బలగాలు భద్రత కల్పిస్తున్నాయి. అక్కడి నుంచి కేవలం సైనిక విమానాలే కాకుండా, విదేశాలకు చెందిన పౌరరవాణా విమానాలు కూడా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అఫ్గాన్‌ మహిళా నేతలు, పాత్రికేయులు సహా అమెరికా జర్నలిస్టులను సైనిక విమానాల్లో తరలించాం. మేం చేపట్టిన పని పూర్తికాకుండా అఫ్గాన్‌ను విడిచివెళ్లే ప్రసక్తే లేదు’’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

ఓ వైపు ఆకలిదప్పులు.. మరోవైపు ఉత్కంఠ

బైడెన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం కాబుల్‌ విమానాశ్రయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ‘ఎప్పుడెప్పుడు తమను తరలిస్తారా!’ అన్న ఆత్రుత, ఉత్కంఠ వేల మంది మోముల్లో కనిపించాయి. వీరందరికీ ఆకలిదప్పులు తప్పడంలేదు. విమానాశ్రయంలో తాగునీటికి కటకట నెలకొంది! 


భారత్‌ ప్రభావం తగ్గించడానికే..

అఫ్గాన్‌లో పాక్‌ వ్యూహాలు అమెరికా నిఘా వర్గాల నివేదిక

అఫ్గానిస్థాన్‌పై భారత్‌ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (డీఐఏ) ఇచ్చిన సమాచారాన్ని అమెరికా విదేశాంగశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కార్యాలయం త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. ‘‘అఫ్గాన్‌ అంతర్యుద్ధ ఫలితంగా పాకిస్థాన్‌ వ్యతిరేక తీవ్రవాదులు బలపడొచ్చని, శరణార్థులు పెద్ద సంఖ్యలో తమ భూభాగంలోకి ప్రవేశించవచ్చని, తద్వారా దేశంలో అస్థిరత ఏర్పడవచ్చని పాకిస్థాన్‌ ఆందోళన చెందుతోంది. అఫ్గాన్‌పై భారత్‌ ప్రభావం తగ్గించే విధంగా తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, శాంతి చర్చలకు మద్దతివ్వాలని భావిస్తోంది. మునుపటితో పోల్చితే, తాలిబన్లకు పాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక సహకారం పెరిగింది. ఒకప్పుడు మసీదుల నుంచి వసూళ్లకు పాల్పడిన తాలిబన్లు... ఇప్పుడు సరిహద్దు నగరాలు, పట్టణాల్లో యథేఛ్ఛగా వసూలు చేస్తున్నారు. ఒక్కో దుకాణం నుంచి 50 డాలర్ల వరకూ అందుతున్నాయి.అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణను ఇరాన్‌ స్వాగతించినా, ఆ దేశంలో తాలిబన్‌ పాలనను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’’ అని నిఘా వర్గాలు విశ్లేషించాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని