Afghan women: ప్రాణాలకు తెగించి.. తాలిబన్ల రాజ్యంలో మహిళల నిరసన..!

తాజా వార్తలు

Updated : 18/08/2021 16:47 IST

Afghan women: ప్రాణాలకు తెగించి.. తాలిబన్ల రాజ్యంలో మహిళల నిరసన..!

కాబుల్‌: అఫ్గానిస్థాన్ తాలిబన్‌ వశం కావడంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సిటీ బస్సుల కోసం పరిగెత్తినట్లు విమానం వెంట పడటం, గాల్లోకి లేచిన విమానాన్ని పట్టుకొని దేశం దాటాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోవడం.. ఇలా ఎన్నో విషాద ఘటనలు కనిపించాయి. అంతా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కొందరు మహిళలు మాత్రం తమ హక్కుల్ని కాపాడుకొనేందుకు నడుం బిగించారు. తాలిబన్లతో నిండిన దేశంలో.. ధైర్యంగా బహిరంగంగా నిరసన చేపట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

కాబుల్‌ వీధుల్లో నలుగురు అఫ్గాన్ మహిళలు చేతితో రాసిన కొన్ని కాగితాలను ప్రదర్శిస్తూ కనిపించారు. ‘ఇన్ని సంవత్సరాలుగా మేం సాధించిన విజయాలు, మేం దక్కించుకున్న కనీస హక్కులు వృథాగా పోకూడదు’ అంటూ వారు నినదిస్తున్నారు. వారు నిరసన వ్యక్తం చేస్తోన్న సమయంలో తాలిబన్లు వారిని చుట్టుముట్టి ఉండటం గమనార్హం. అయినా, వారి మొహంలో భయమేమీ కనిపించడం లేదు. ఈ వీడియోను ఇరాన్‌కు చెందిన పాత్రికేయురాలు, హక్కుల కార్యకర్త షేర్ చేశారు. ‘గుండె నిండా ధైర్యం నింపుకున్న ఈ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా కాబుల్ వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నిలబడ్డారు. వారికి అండగా మరికొంత మహిళలు, పురుషులు జత కలుస్తారని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు. 

మరోపక్క.. అఫ్గానిస్థాన్‌లో ప్రధాన మీడియా సంస్థ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్‌ రాకతో ఆందోళన గురైన ఆ సంస్థ మొదట తమ మహిళా యాంకర్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత ధైర్యం చేసి వారిని విధుల్లోకి తీసుకోవడంతో మళ్లీ టీవీ తెరలపై వారు దర్శనమిచ్చారు. 

తొలి మహిళా గవర్నర్‌ను బంధించిన తాలిబన్లు ..

ఇదిలా ఉండగా.. తాలిబన్లుపై పోరాడేందుకు ఆయుధాలు చేతపట్టిన యోధురాలు, అఫ్గానిస్థాన్‌ మహిళా గవర్నర్‌లలో ఒకరైన సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదు. తాలిబన్లు చొచ్చుకొని వస్తోన్న క్రమంలో ప్రముఖ నేతలంతా ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయారు. కానీ, బాల్ఖ్‌ ప్రావిన్స్‌ను వారు ఆక్రమించనున్నారని తెలిసినప్పటికీ.. ఆమె మాత్రం అక్కడే ఉండిపోయారు. ఈ ఆక్రమణల క్రమంలో ఇదివరకే ఆమె తన ప్రజల గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

అఫ్గాన్‌ తాజా పరిణామాలతో మళ్లీ మహిళలంతా ఆంక్షల వలయంలో బందీ కావాల్సిన పరిస్థితులు ఎదురుకానున్నాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. అయితే, తాలిబన్లు మాత్రం ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించినట్లు ప్రకటించారు. ఇస్లామిక్ చట్టాలు, దేశ సాంస్కృతి విలువలకు లోబడి మహిళలు చదువుకునేందుకు, పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, వారి హామీలు వినడానికి బాగానే ఉన్నా.. వాటిలో స్పష్టత కొరవడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని