Gang Rape Case: ‘వారు జీవితాంతం పశ్చాత్తాపం చెందాలి’

తాజా వార్తలు

Updated : 25/11/2021 17:54 IST

Gang Rape Case: ‘వారు జీవితాంతం పశ్చాత్తాపం చెందాలి’

శక్తి మిల్స్ సామూహిక అత్యాచార ఘటనలో శిక్ష తగ్గిస్తూ.. హైకోర్టు వ్యాఖ్య

ముంబయి: ప్రజల్లో వ్యక్తమవుతోన్న ఆగ్రహావేశాలు తీర్పుల్ని నిర్ణయించలేవని గురువారం బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. శక్తి మిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనలో దోషులకు విధించిన మరణశిక్షను తగ్గిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. వారికి కింది కోర్టు విధించిన శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ‘వారు చేసిన నేరానికి పశ్చాత్తాపం చెందాలంటే వారు జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలి’ అని ఈ సందర్భంగా వెల్లడించింది.

‘శక్తిమిల్స్ సామూహిక అత్యాచార ఘటన సభ్య సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటన కారణంగా బాధితురాలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. ఇది  పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనే. అయితే ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆందోళనను మాత్రమే పరిగణనలోకి తీసుకోలేం. మరణ శిక్ష ఒక మినహాయింపు మాత్రమే. ప్రజాగ్రహం ఆధారంగా తీర్పులుండకూడదు’ అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘మరణం పశ్చాత్తాప భావనకు ముగింపు పలుకుతుంది. వారు చేసిన నేరానికి పశ్చాత్తాపం చెందేందుకు జీవితాంతం జైలు శిక్ష అనుభవించేందుకు వారు అర్హులు. అలాగే వారు జీవిత కాలంలో సమాజంతో కలవలేరు’ అంటూ పేర్కొంది. 

అసలు శక్తి మిల్స్ ఘటన ఎప్పుడు జరిగిందంటే...?

సెంట్రల్ ముంబయిలో నిరుపయోగంగా ఉన్న శక్తి మిల్స్‌లో ఆగస్టు 22, 2013న ఈ సామూహిక అత్యాచార ఘటన జరిగింది. ఆ సమయంలో ఫొటో జర్నలిస్టు అయిన బాధితురాలు(22) తన సహోద్యోగితో షూట్ కోసం ఆ ప్రాంతానికి వెళ్లారు. అదే అదును చూసి ఐదుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.  దీనిపై 2014లో ట్రయల్ కోర్టు నలుగురికి శిక్ష ఖరారు చేసింది. అయితే అదే ప్రాంతంలో అంతకు ముందు మరో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని తేలడంతో అందులో ముగ్గురుకి మరణశిక్ష విధించింది. వారిని రిపీట్ అఫెండర్స్‌గా తేలుస్తూ ఈ శిక్ష వేసింది. ఇంకొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఐదో వ్యక్తి మైనర్ కావడంతో కరెక్షన్ కేంద్రానికి తరలించింది. మరణశిక్ష పడిన ఆ దోషులు ముగ్గురు 2014లో హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. శక్తి మిల్స్ ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని