Corona in Kerala: కేరళలో ఐదో రోజూ అదేతీరు..!

తాజా వార్తలు

Updated : 01/08/2021 02:33 IST

Corona in Kerala: కేరళలో ఐదో రోజూ అదేతీరు..!

నిత్యం 20వేలకు పైగా కొత్త కేసులు

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త నియంత్రణలోనే ఉన్నప్పటికీ కేరళ రాష్ట్రాన్ని మాత్రం ఈ మహమ్మారి వణికిస్తోంది. నిత్యం 20వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 20,624 పాజిటివ్‌ కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. రోజువారీ కేసులు 20వేలు దాటడం వరుసగా ఇది ఐదో రోజు. దీంతో కేరళలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 12.31శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 64వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.

సెకండ్‌ వేవ్‌ నుంచి విముక్తి కాలేదు..

రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉందని.. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ నుంచి రాష్ట్రం విముక్తి కాలేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇంకా సగం మందికి వైరస్‌ బారినపడే ముప్పు పొంచివుందన్నారు. అంతేకాకుండా సగం జనాభాకు ఇంకా కరోనా వ్యాక్సిన్‌ అందించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్‌ వెలుగు చూసినందున వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టడంలో భాగంగా ఆమె వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

వ్యాక్సిన్‌ అందేనాటికే మూడో ముప్పు

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ అందరికీ అందేనాటికే థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ అంచనా వేశారు. అలాంటి సమయంలో వైరస్‌ తీవ్రతతో ఆస్పత్రిలో చేరికలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అందుచేత మూడో ముప్పును నిర్మూలించడానికి ప్రజలు కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించడంతో పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని