Maharashtra Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండచరియలు

తాజా వార్తలు

Updated : 23/07/2021 13:01 IST

Maharashtra Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండచరియలు

ముంబయి: భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతోంది. ముంబయి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడగా.. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

రాయ్‌గఢ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..

రాయ్‌గఢ్‌ జిల్లాలోని తలై గ్రామంలో భారీ వర్షాలకు నిన్న రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. ఇప్పటివరకు 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఇంకా కనీసం 30 మంది శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. రహదారిపైకి భారీగా వరదనీరు రావడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు రాయ్‌గఢ్‌ కలెక్టర్‌ తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ముంబయి-గోవా, ముంబయి-నాసిక్‌ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆ మార్గాల్లో వేలాది వాహనాలు బారులు తీరాయి.

జలదిగ్బంధంలో గ్రామాలు..

భారీ వర్షాల కారణంగా రత్నగిరి జిల్లాలో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. తీర గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరింది. కనీసం 27 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఠాణె, పాల్ఘర్‌, సింధుదుర్గ్‌, కొల్హాపూర్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో అక్కడి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాల సంబంధిత ఘటనల్లో పాల్ఘర్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ముంబయిలో కూలిన భవనం..

వాణిజ్య రాజధాని ముంబయిలోని గోవండి ప్రాంతంలో వర్షాల కారణంగా ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

సీఎంకు మోదీ ఫోన్‌..

మహారాష్ట్రలో వర్షాలు, వరదల పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేశారు. కేంద్రం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని