Covid in Kerala: కేరళలో తగ్గని ఉద్ధృతి.. 14.3శాతం పాజిటివిటీ రేటు

తాజా వార్తలు

Published : 13/08/2021 21:22 IST

Covid in Kerala: కేరళలో తగ్గని ఉద్ధృతి.. 14.3శాతం పాజిటివిటీ రేటు

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కాస్త అదుపులోనే ఉన్నా.. కేరళను మాత్రం కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. నిత్యం 20వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,452 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 62వేలు దాటగా, మరణాల సంఖ్య 18వేలు దాటినట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 80వేల క్రియాశీల కేసులు ఉండగా.. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 14.35శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో లక్షా 42వేల నమూనాలను పరీక్షించగా పాజిటివిటీ రేటు 14.35శాతంగా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. మలప్పురంలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 3010 కేసులు నమోదు కాగా, కొళికోడ్‌లో 2426, ఎర్నాకులంలో 2388 కేసులు వెలుగు చూశాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించడంతోపాటు ట్రాకింగ్‌ వ్యవస్థను కూడా పకడ్బందీగా చేపడుతున్నట్లు వీణా జార్జ్‌ స్పష్టం చేశారు.

మరోవైపు, కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ కేరళలో పర్యటించనున్నారు. ఈ నెల 16న కేరళలో, 17న అసోంలో పర్యటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను నియమించి మహమ్మారి నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.

దిల్లీలో మూడో రోజు కొవిడ్ మరణాలు లేవ్‌..

దేశ రాజధానిని వణికించిన కరోనా వైరస్‌ మహమ్మారి, ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 24గంటల్లో అక్కడ 50 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మరణాలు చోటుచేసుకోలేదు. వరుసగా మూడో రోజు కొవిడ్‌ మరణాలు సంభవించకపోవడం ఊరట కలిగించే విషయం. ఇక సెకండ్‌ వేవ్‌ నుంచి ఇప్పటివరకు కొవిడ్‌ మరణాలు చోటుచేసుకోకపోవడం ఇది తొమ్మిదోసారి. ప్రస్తుతం అక్కడ కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0.07శాతంగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని