Parliament Mansoon Session: పార్లమెంట్‌లో అదే రగడ.. మళ్లీ వాయిదా

తాజా వార్తలు

Published : 26/07/2021 11:43 IST

Parliament Mansoon Session: పార్లమెంట్‌లో అదే రగడ.. మళ్లీ వాయిదా

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో సోమవారం కూడా అదే గందరగోళం నెలకొంది. పెగాసస్‌ వ్యవహారంపై చర్చకు విపక్షలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వారి నినాదాల నడుమే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. ప్రతిపక్ష ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, హర్‌దీప్‌ సింగ్‌ పురి సమాధానమిచ్చారు. అయితే విపక్షాలు ఆందోళన ఉద్ధృతం చేయడంతో స్పీకర్‌ వారించారు. అన్ని అంశాలపై చర్చ జరుగుతుందని, ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వారు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అటు పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు..

మహమ్మారి వేళ ఇబ్బందులను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టారంటూ వైకాపా ఎంపీ మిథున్‌ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిచ్చారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు 2019 నుంచి ఎంఎస్‌ఎంఈల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎస్‌ఎంఈల కోసం అత్యవసర రుణ పథకం హామీ అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకానికి మంచి స్పందన లభిస్తోందని, అందుకే అదనంగా రూ.1.5లక్షల కోట్లకు విస్తరించామని తెలిపారు. ఈ పథకం కింద ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.4.5లక్షల కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు.

మీరాబాయి చానుకు అభినందనలు..

అంతకుముందు ఉభయ సభలు ప్రారంభం కాగానే కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పించాయి. వారి సేవలను సభ్యులు కొనియాడారు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్ లిఫ్టర్‌ మీరాబాయి చానును ఉభయసభలు అభినందించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని