Covid Vaccine: భారత్‌లో 60కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా 500కోట్ల డోసులు!

తాజా వార్తలు

Published : 25/08/2021 22:36 IST

Covid Vaccine: భారత్‌లో 60కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా 500కోట్ల డోసులు!

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఇప్పటివరకు 60కోట్ల డోసులను పంపిణీ చేశామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ప్రతిఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమం కొనసాగుతోందని.. తాజాగా ఇది 60కోట్ల మార్కును దాటడం పట్ల ఆయన అందరికీ అభినందనలు తెలిపారు.

దేశంలో 10కోట్ల డోసులను పంపిణీ చేయడానికి 85 రోజులు పట్టింది. 20 కోట్ల మార్కును దాటడానికి 45 రోజుల సమయం తీసుకుంది. మరో 29 రోజుల్లో 30కోట్ల మార్కును దాటింది. 30 నుంచి 40కోట్లు చేరడానికి 24 రోజులు పట్టింది. మరో 20 రోజుల్లోనే, ఆగస్టు 6నాటికి దేశవ్యాప్తంగా 50 కోట్ల డోసులను ఇచ్చాం. అప్పటినుంచి 19రోజుల్లోనే 60కోట్ల మార్కును దాటాం ’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని భారత్‌ ఈఏడాది జనవరి 16న ప్రారంభించింది. తొలుత ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వగా.. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు అందించడం మొదలు పెట్టారు. మరో దఫాలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 60ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇచ్చే కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం ఏప్రిల్‌ 1 నుంచి 45ఏళ్ల పైబడిన వారికి ఇవ్వడం మొదలుకాగా.. మే 1 నుంచి 18ఏళ్లు నిండిన వారందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18ఏళ్ల వయసుపైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఇదే సమయంలో తాజాగా 12ఏళ్ల వయసుపైబడిన వారికోసం జైడెస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్‌ చివరినాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల డోసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 183 దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా దాదాపు 500కోట్లకుపైగా డోసులను అందించినట్లు అంతర్జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో అత్యధిక డోసుల పంపిణీతో చైనా తొలిస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకూ ఒక్క చైనాలోనే 196కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం. తర్వాతి స్థానంలో ఉన్న భారత్‌ ప్రస్తుతం 60కోట్ల డోసుల మార్కును దాటింది. యూరోపియన్‌ యూనియన్‌లో 51 కోట్లు, అమెరికాలో 36కోట్ల కరోనా డోసులను అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని