Mann Ki Baat: దేశం ‘మనసులో మాట’ వింటే బాగుండేది!

తాజా వార్తలు

Published : 25/07/2021 23:55 IST

Mann Ki Baat: దేశం ‘మనసులో మాట’ వింటే బాగుండేది!

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదించడంపై రాహుల్‌ గాంధీ విమర్శ

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్న తీరును కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి ప్రశ్నించారు. దేశ మనసును (Mann Ki Baat) అర్థం చేసుకుంటే వ్యాక్సినేషన్‌ పరిస్థితి ఇలా ఉండేది కాదంటూ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రసంగించే ముందే వ్యాక్సినేషన్‌ తీరుపై రాహుల్‌ గాంధీ ఈ విధంగా వ్యంగాస్త్రాలు విసిరారు.

‘దేశ మనసును అర్థం చేసుకుంటే వ్యాక్సినేషన్‌పై ప్రస్తుతం ఇలాంటి దుస్థితి ఉండేది కాదు’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. వ్యాక్సిన్‌లు ఎక్కడా (WhereAreVaccines) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసిన రాహుల్‌ గాంధీ, దేశంలో వ్యాక్సిన్‌ ప్రక్రియ మందగించిందంటూ వస్తోన్న వార్తా కథనాలను షేర్‌ చేశారు. దేశంలో మూడోవేవ్‌ను అడ్డుకోవాలంటే ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి దేశ జనాభాలో 60శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందించాల్సి ఉంది. ఇందుకోసం నిత్యం సరాసరి 93లక్షల డోసులను పంపిణీ చేయాలి. కానీ, ప్రస్తుతం ప్రతిరోజు సరాసరి 36లక్షల డోసులను మాత్రమే ప్రభుత్వాలు పంపిణీ చేయగలుగుతున్నాయి. దీంతో రోజువారీగా దాదాపు 56లక్షల డోసుల కొరత ఏర్పడుతోందని వస్తోన్న వార్తా కథనాలను రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

3.29 కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద ఉన్నాయ్‌: కేంద్రం

కరోనా వ్యాక్సిన్‌ కొరత ఉందంటూ అటు కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తోన్న తరుణంలోనే పలు రాష్ట్రాలు కూడా కేంద్రానికి ఇదే విధమైన విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత లేదని పేర్కొంటోంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో దాదాపు 3.29కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటులోనూ వ్యాక్సిన్‌లు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకూ 45.37కోట్ల డోసులను రాష్ట్రాలకు అందించగా.. వాటిలో 42కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని