Fuel prices hike: ‘పన్నుల దోపిడి’కి పాల్పడుతోన్న ప్రభుత్వం!

తాజా వార్తలు

Updated : 18/10/2021 01:42 IST

Fuel prices hike: ‘పన్నుల దోపిడి’కి పాల్పడుతోన్న ప్రభుత్వం!

ప్రభుత్వంపై రాహుల్‌, ప్రియాంకా గాంధీ మండిపాటు

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరగడం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. వీటిపై తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసుకుంటూ ధరల పెరుగుదలను మాత్రమే అభివృద్ధి చేస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పన్నుల పేరుతో ప్రభుత్వం దోపిడికి పాల్పడుతోందని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు ప్రభుత్వాల పన్నులే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాటికి గల కారణాలను విశ్లేషిస్తూ వార్తాపత్రికలు, మీడియాలో కథనాలు వెలుబడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం పన్నులను పెంచకుంటే లీటరు పెట్రోల్‌ ధర రూ. 66, డీజిల్‌ రూ.55కే వచ్చేదని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం ‘పన్ను దొపిడి’కి పాల్పడుతుందని ట్విటర్‌లో ఆరోపించారు.

ఇదే సమయంలో దేశంలో ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ విరుచుకుపడ్డారు. ఇంధన ధరలను రోజూ పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం.. డీజిల్‌ ధరను వంద దాటేలా చేసింది. ఈ ధరల పెరుగుదలతో కూలీలు, రైతులపై తీవ్ర భారం పడుతోంది. వీటివల్ల కేవలం మోదీ స్నేహితులు మాత్రమే సంపన్నులుగా మారుతున్నారని ఆరోపించారు. ఎరువుల ధరలనూ భారీగా పెంచుతున్నారన్న ఆమె.. ఎన్‌పీకే (ఫర్టీలైజర్‌) ధర ఏకంగా రూ.275 పెంచడంపై కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే, రోజురోజుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు (ఆదివారం నాడు) కూడా 35పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.105.84కి చేరగా.. ముంబయిలో 111.77కి పెరిగింది. డీజిల్‌ ధర ముంబయిలో 102.52కి చేరగా.. దిల్లీలో రూ.94.57కి చేరింది. హైదరాబాద్‌లోనూ లీటరు పెట్రోల్‌ రూ.110కి చేరగా.. డీజిల్‌ రూ. 103దాటింది. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని