ఉద్దేశపూర్వకంగానే ‘పెగాసస్‌’పై కథనాలు

తాజా వార్తలు

Updated : 19/07/2021 17:07 IST

ఉద్దేశపూర్వకంగానే ‘పెగాసస్‌’పై కథనాలు

లోక్‌సభలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

దిల్లీ: ‘పెగాసస్‌’ అనే స్పైవేర్‌ సాయంతో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వస్తున్న కథనాలను కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కొట్టిపారేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ఇలాంటి వార్తలు రావడం కాకతాళీయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

‘పెగాసస్‌’తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోమవారం లోక్‌సభలో స్పందించారు. ఎంతో పటిష్ఠమైన న్యాయవ్యవస్థ, చట్టాలు ఉన్న మన దేశంలో ‘అనధికారిక వ్యక్తులతో అక్రమ పద్ధతిలో నిఘా’ అసాధ్యమని ఆయన అన్నారు. ‘‘నిన్న రాత్రి ఓ వెబ్‌ పోర్టల్‌ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకుఉ ఒక్కరోజు ముందు ఈ కథనాలు రావడం ఏ మాత్రం కాకతాళీయం కాదనిపిస్తోంది. పెగాసస్‌తో వాట్సాప్‌ను హ్యాక్‌ చేస్తున్నట్లు గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అయితే అవన్నీ నిరాధారమని తేలింది. తాజాగా వచ్చిన మీడియా కథనం కూడా అలాంటిదే అనిపిస్తోంది. ఫోన్‌ను సాంకేతికంగా విశ్లేషించకుండా హ్యాకింగ్‌కు గురైందా లేదా అని చెప్పడం సాధ్యం కాదు. లీకైన డేటాబేస్‌లో ఉన్న ఫోన్‌ నంబర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఆ కథనం స్పష్టంగా చెప్పలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా సంచలనం కోసమే ఇలాంటి కథనాలు తీసుకొస్తున్నారు. భారత ప్రజాస్వామ్యంపై బురద జల్లేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా అనిపిస్తోంది’’ అని మంత్రి దుయ్యబట్టారు.

ఈ హ్యాకింగ్‌ వ్యవహారంపై ‘ది వైర్‌’ వార్తా సంస్థ నిన్న ఓ కథనం ప్రచురించింది. దీని ప్రకారం.. ‘పెగాసస్‌’తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారందరి ఫోన్‌ నంబర్లు తాజా డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తల వంటి వారు బాధితుల జాబితాలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. 2018-19 సంవత్సరాల మధ్య వీరిని లక్ష్యంగా చేసుకున్నట్లు సదరు కథనం పేర్కొంది. వాస్తవానికి ఈ స్పైవేర్‌ ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉంటుంది. దీంతో తాజా హ్యాకింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే- ఇందులో తమ జోక్యం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దేశ పౌరులందరి గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని