75ఏళ్ల తర్వాత కూడా రాజద్రోహ చట్టం అవసరమా?

తాజా వార్తలు

Updated : 15/07/2021 15:08 IST

75ఏళ్ల తర్వాత కూడా రాజద్రోహ చట్టం అవసరమా?

కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: రాజద్రోహం కేసులు పెట్టడానికి వీలు కలిగిస్తున్న భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ ‘124-ఏ’ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశద్రోహం ఓ వలస చట్టమని అభివర్ణించిన న్యాయస్థానం.. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఈ చట్టం అవసరమా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలిస్తామన్న కోర్టు.. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

సెక్షన్‌ 124-ఏ చట్టాన్ని సవాలు చేస్తూ విశ్రాంత సైనికాధికారి మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ఎన్‌.జి. వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజద్రోహం చట్టం బ్రిటన్‌ నుంచి తెచ్చుకున్న వలస చట్టం. స్వాతంత్ర్య సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటీష్‌ వారు ఈ చట్టం తీసుకొచ్చారు. భారతీయుల అణచివేతకు తెల్లదొరలు దీన్ని ఉపయోగించారు. గాంధీ, తిలక్‌ వంటివారిని ఈ చట్టంతోనే అణచివేయాలని చూశారు. ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు అవుతోంది. ఇప్పుడు కూడా ఈ చట్టం అవసరమా’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు.

పిచ్చోడి చేతిలో రాయిలా..

‘‘రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని? అందులో నిలబడుతున్నవి ఎన్ని? సెక్షన్‌ దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించట్లేదు?ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న సందర్భాలే ఎక్కువ. ఈ చట్టంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పేకాట ఆడేవారిపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల అణచివేత కోసం దీన్ని తప్పుగా వినియోగిస్తున్నారు. ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా వ్యవహరిస్తున్నారు. బెయిల్‌ రాకుండా కక్ష సాధింపు, అధికార దాహంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు, వ్యక్తులను బెదిరించే స్థాయికి దిగజారుతున్నారు. రాజద్రోహం సెక్షన్‌ 124-ఏ పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. కొయ్యను మలిచేందుకు రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్లుంది’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. రాజద్రోహం సెక్షన్‌ 124-ఏ తొలగింపునకు ఆలోచించాలని ధర్మాసనం ఈ సందర్భంగా కేంద్రాన్ని సూచించింది. ఈ చట్టం రద్దుపై వైఖరిని తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్‌ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటన్నింటినీ ఒకేసారి విచారిస్తామని వెల్లడించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని