Taliban: గళమెత్తిన అఫ్గాన్‌ మహిళలు.. తాలిబన్ల కాల్పులు!

తాజా వార్తలు

Updated : 07/09/2021 15:05 IST

Taliban: గళమెత్తిన అఫ్గాన్‌ మహిళలు.. తాలిబన్ల కాల్పులు!

పాకిస్థాన్‌ వ్యతిరేక ర్యాలీలతో మార్మోగిన కాబుల్‌

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ వ్యహహారాల్లో పాకిస్థాన్‌ జోక్యంతో పాటు తాలిబన్ల చర్యలను నిరసిస్తూ అక్కడి పౌరులు చేస్తోన్న నిరసన కార్యక్రమాలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం వద్ద అఫ్గాన్‌ మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇస్లామాబాద్‌, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో కాబుల్‌ నగరం మార్మోగి పోయింది. దీంతో ఆగ్రహం చెందిన తాలిబన్లు.. పాక్‌ రాయబార కార్యాలయం వద్ద నిరసన చేస్తోన్న మహిళలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. తాలిబన్ల క్రూర చర్యలతో ఆ ప్రాంతమంతా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు కాబుల్‌లోని స్థానిక మీడియా వెల్లడించింది.

అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ క్రూర చర్యలను కొనసాగిస్తూనే ఉన్నట్లు సమాచారం. ప్రముఖులు, మహిళలపై దాడులు చేస్తూ గతంలో కంటే ఎక్కువగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తమ దేశ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ జోక్యం చేసుకుంటుందనే ఆందోళన అక్కడి వారిలో మొదలయ్యింది. తాజాగా పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ తాలిబన్లను కలవడం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చింది. అఫ్గాన్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందనే ఆందోళన అఫ్గాన్‌ వాసుల్లో ఎక్కువయ్యింది. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న అఫ్గాన్‌ మహిళలు.. ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసేందుకు అఫ్గాన్‌ వీధుల్లోకి వస్తున్నారు. నిరసనలో భాగంగా కాబుల్‌లోని పాక్‌ రాయబార కార్యాలయంతో పాటు అక్కడి అధ్యక్ష భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన తాలిబన్లు నిరసన జరుగుతోన్న ప్రాంతంలో గాల్లోకి కాల్పులు జరిపి నిరసన చేస్తోన్న మహిళలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఇదిలాఉంటే, తాలిబన్‌లు ఆఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత పాకిస్థాన్‌ ఇంటర్‌-సర్వీసెన్‌ ఇంటెలిజెన్స్‌(ISI) డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ హమీద్‌ అఫ్గానిస్థాన్‌లో పర్యటించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అక్కడ అఫ్గాన్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్న తాలిబన్‌ నాయకుడు ముల్లా అబ్దుల్‌ బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌ కలవడంతో ఆందోళన ఎక్కువైంది. వాటిపై స్పందించిన తాలిబన్‌లు.. బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌ కలిసిన మాట వాస్తవమేనన్నారు. అయితే, కేవలం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగానే పాక్‌ నిఘా విభాగాధిపతి తమ అగ్రనేతతో భేటీ అయినట్లు తాలిబన్ల అధికార ప్రతినిధులు వెల్లడించారు. కానీ, అఫ్గాన్‌ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం పాకిస్థాన్‌తో పాటు ఏ ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల్లో పాక్‌ జోక్యం, తాలిబన్ల తీరును నిరసిస్తూ అఫ్గాన్‌ మహిళలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని