Imran Khan: తాలిబన్లు సాధారణ పౌరులేనట..!

తాజా వార్తలు

Published : 29/07/2021 14:36 IST

Imran Khan: తాలిబన్లు సాధారణ పౌరులేనట..!

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ మరో వివాదాస్పద వ్యాఖ్య

వాషింగ్టన్‌: వరుస వివాదాస్పద ప్రకటనలతో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ వార్తల్లో నిలుస్తున్నారు. మహిళల వస్త్రాధరణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా తాలిబన్లకు వంతపాడారు. తాలిబన్లు సాధారణ పౌరులేనని.. వారు సైన్యం దుస్తుల్లో ఉన్న ముఠా కాదని అన్నారు. తాలిబన్‌ వర్గానికే చెందిన దాదాపు 30లక్షల మంది అఫ్గానీయులు పాక్‌ సరిహద్దుల్లో ఉండగా.. వారిని ఎలా బంధిస్తామని ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో ఉన్న అఫ్గాన్‌ శరణార్థుల్లో మెజారిటీ ప్రజలు పష్తూన్‌ వర్గానికి చెందిన వారే ఉన్నారని అమెరికా మీడియా సంస్థ పీఎస్‌బీ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

‘ పాక్‌ సరిహద్దుల్లో 5లక్షలు, ఒక లక్ష సామర్థ్యం కలిగిన శరణార్థి శిబిరాలు ఉన్నాయి. తాలిబన్లు మిలటరీ దుస్తుల్లో ఉన్న సైన్యం కాదు. వారు కేవలం సాధారణ పౌరులే. అలాంటప్పుడు వారిని ఎలా గుర్తించి బంధిస్తాం’ అని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తాలిబన్లకు పాకిస్థాన్‌ సురక్షిత ఆవాసమని వస్తోన్న వార్తలపై ప్రశ్నించగా.. తాలిబన్‌ వర్గానికే చెందిన లక్షల మంది పాకిస్థాన్‌లో శరణార్థులుగా ఉన్నారని సమాధానమిచ్చారు.

అఫ్గాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న తాలిబన్‌లకు ఆర్థికంగా, నిఘా అంశాల్లో పాకిస్థాన్‌ సహాయం చేస్తోందని ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ విధంగా స్పందించారు. ముఖ్యంగా అమెరికా సైన్యం అఫ్గాన్‌ను విడిచివెళ్లిన తర్వాత తాలిబన్లకు పాకిస్థాన్‌ సురక్షిత ప్రాంతంగా మారిందని అమెరికా మాజీ సైన్యాధికారి ఈమధ్యే అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తాలిబన్లకు సాయం చేసేందుకు దాదాపు పదివేల మంది పాకిస్థాన్‌ సైన్యం సరిహద్దు దాటుతున్నారనే నివేదికలు వచ్చాయి. ఇటువంటి ఆరోపణలను మాత్రం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తోసిపుచ్చారు. అఫ్గాన్‌లో అమెరికా చేసిన యుద్ధం తర్వాత వేల మంది పాకిస్థానీలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని