Twitter India: ట్విటర్‌ ఇండియా చీఫ్‌ అమెరికాకు బదిలీ

తాజా వార్తలు

Published : 13/08/2021 22:05 IST

Twitter India: ట్విటర్‌ ఇండియా చీఫ్‌ అమెరికాకు బదిలీ

ప్రభుత్వం, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో కీలక నిర్ణయం

దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీల మధ్య గతకొద్ది రోజులుగా ఘర్షణ వాతావరణం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్‌ ఇండియా చీఫ్‌గా వ్యవహరిస్తోన్న మనీశ్‌ మహేశ్వరికి ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మనిశ్‌ మహేశ్వరి ఇక నుంచి అమెరికా కేంద్రంగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని ట్విటర్‌కు దక్షిణ కొరియా, జపాన్‌, ఆసియా పసిఫిక్‌ (JAPC) విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్న యూ-సన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇక భారత ఐటీ చట్టాలను పాటించకపోవడం నుంచి ఇతర కేసులకు సంబంధించి గతకొద్ది రోజులుగా ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ముఖ్యంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలపైనా ట్విటర్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వీడియోకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని యూపీ పోలీసులు ట్విటర్‌ ఎండీకి నోటీసులు జారీచేశారు. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అక్కడ ఊరట కలిగింది.

ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నుంచీ ట్విటర్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఖాతాను నిలిపివేయడంతో ఒత్తిడి ఎక్కువైంది. నిబంధనల ప్రకారం నిష్పాక్షికంగానే వ్యవహరించామని.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్వీట్లను తొలగించకపోతే సంబంధిత ఖాతాను సంస్థ తాత్కాలికంగా నిలిపివేస్తుందని ట్విటర్‌ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ భారత రాజకీయ విధానాల్లో జోక్యం చేసుకుంటోందని ట్విటర్‌పై రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఇలా రోజురోజుకు ట్విటర్‌పై ఒత్తిడి పెరుగుతోన్న సమయంలోనే ఆ సంస్థకు ఇండియా చీఫ్‌గా వ్యవహరిస్తోన్న వ్యక్తికి ఇతర బాధ్యతలు అప్పగిస్తూ ట్విటర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ట్విటర్‌ ఇండియా డైరెక్టర్‌గా ఎవరు వ్యవహరిస్తారనే విషయంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇకనుంచి కొత్త డైరెక్టర్‌గా ఎవరినీ నియమించక పోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని