కొవిడ్ వేళ.. కాస్త ఊరటనిచ్చే వార్త!

తాజా వార్తలు

Published : 27/04/2021 07:03 IST

కొవిడ్ వేళ.. కాస్త ఊరటనిచ్చే వార్త!

దిల్లీ: కరోనా రెండో దశలో భారీగా పెరుగుతున్న కేసులు, మరణాలు..ఆసుపత్రుల్లో నిండుకుంటున్న పడకలు.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి అందని ఆక్సిజన్.. జాగాలేని శ్మశాన వాటికలు.. గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే వీటన్నింటి మధ్య భారతీయులు ఊపిరి పీల్చుకునే కొన్ని లెక్కలున్నాయి. అవే రికవరీలు, మరణాల రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మరణాల రేటు 1.12 శాతంగా ఉంది. అంటే మొత్తం కేసుల్లో ఒకశాతం పైగా అని. ఆ లెక్కన చూసుకుంటే దాదాపు 99 శాతం మంది కొవిడ్ నుంచి కోలుకొని బయటపడినవారేనని గణాంకాలు చెప్తున్నాయి. 

నిన్న 3.52లక్షల మందికి కరోనా సోకగా.. 2,812 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు కోటీ 73 లక్షలకు పైబడగా..1.95లక్షల మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్యలో నుంచి మరణించిన వారి సంఖ్య పోగా మిగిలేది వైరస్ నుంచి బయటపడినవారే. ప్రస్తుత లెక్కల ప్రకారం.. మరణాలు రేటు 1.12 శాతంగా ఉండగా, 98.8 శాతం మంది కోలుకుంటున్నారు. చాలా మంది ఆసుపత్రులకు వెళ్లకుండానే ఇంట్లో ఐసోలేషన్‌లోనే వైరస్‌ను జయిస్తున్నారు. అలాగే ఆసుపత్రిలో చేరిన వారిలో దాదాపు 28 శాతం మందికి మెకానికల్ వెంటిలేషన్ అవసరమవుతోంది. మొదటి దశలో అది 37 శాతంగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిన్న 2.20లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్క మనదేశంలోనే ఈ స్థాయిలో రికవరీలు నమోదయ్యాయి. అయితే గత కొద్ది వారాలుగా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో రికవరీలు భారీగా నమోదుకావడం ఓ కారణమని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ..మరణాలు, కేసుల సంఖ్యను తగ్గించుకోవడానికి టీకా వేయించుకోవడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలే శ్రీరామ రక్షగా ఉంటాయని ప్రజలకు సూచిస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని