ఇడుక్కి ఘటనలో 15కి చేరిన మృతులు

తాజా వార్తలు

Published : 07/08/2020 21:13 IST

ఇడుక్కి ఘటనలో 15కి చేరిన మృతులు

మృతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియో: సీఎం 

తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఇడుక్కి జిల్లాలోని రాజమలై వద్ద కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరినట్టు కేరళ సీఎం పినరయి విజయన్‌ వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నింటినీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. కొండచరియల కింద దాదాపు 70 నుంచి 80 మంది చిక్కుకోగా.. వారిలో ఇప్పటివరకు 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని విచారం

ఇడుక్కిలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో తేయాకు కార్మికులు మరణించిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి సాయం అందించనున్నట్టు పీఎంవో తెలిపింది. 

వారి నిబద్ధత భేష్‌..

రాజమలై వద్ద సహాయక చర్యలు కొనసాగిస్తున్న అధికారుల నిబద్ధతను రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రశంసించారు. ఘటన జరిగిన తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు,  స్థానిక ప్రజలు కూడా చిక్కుకున్నవారిని ప్రాణాలతో రక్షించేందుకు కృషిచేస్తున్నారని రాజ్‌భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని