30 ఏళ్లు శ్రమించి.. ఊరికి రోడ్డేశాడు!

తాజా వార్తలు

Published : 06/08/2021 22:55 IST

30 ఏళ్లు శ్రమించి.. ఊరికి రోడ్డేశాడు!

నయాగఢ్: అదో మారుమూల గిరిజన గ్రామం. నగరానికి దూరంగా విసిరి పారేసినట్లు ఉంటుంది. కనీసం మట్టి రోడ్డు కూడా లేని ఆ ఊరికి వెళ్లాలంటే అడవిని దాటాల్సిందే. తెలియనివారైతే.. ఆ కారడవిలో తప్పిపోతుంటారు కూడా. ఆ గ్రామాన్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఈ దుస్థితిని గుర్తించిన ఓ వ్యక్తి రోడ్డు నిర్మించాలని భీష్మించుకున్నాడు. 30 ఏళ్లు శ్రమించి రోడ్డును నిర్మించాడు.

ఒడిశాలోని నయాగఢ్​ జిల్లా బంతపుర్​ పంచాయతీ పరిధిలో ఉంటుంది తులుబి గ్రామం. తమ గ్రామానికి రోడ్డు లేదని, సమస్య తీర్చాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ఆ గ్రామానికి చెందిన హరిహర్​​ బెహరా తన సోదరుడి సాయంతో రోడ్డు నిర్మించాలన్న మహత్తర కార్యానికి నడుం బిగించారు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున్న ఎత్తయిన ప్రాంతంలోని రాళ్లు, చెట్లు, పొదలను తొలగించి.. పెద్ద వాహనాలు సైతం ఆ గ్రామానికి చేరుకునే విధంగా తీర్చిదిద్దాడు. దాదాపు 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ కార్యం ఈ మధ్యే ముగిసింది. ఇప్పుడు ఆ మార్గంలో కాలినడకలే కాదు.. వాహనాల రాకపోకలు కూడా సులువుగా సాగుతున్నాయి.

‘‘గతంలో మా ఊరికి రోడ్డు లేదు. పట్టణానికి వెళ్లాలంటే ఎంతో శ్రమించేవాళ్లం. రహదారి నిర్మించాలని స్థానిక నేతలకు విజ్ఞప్తి చేశాం. అందుకు కుదరదని సమాధానమిచ్చారు. ఆ రోజు నుంచే రోడ్డు నిర్మించడం ప్రారంభించాం. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. ఈ రోడ్డును చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మా ఈ పనిని చూసేందుకు వేరే గ్రామాలవారు కూడా వస్తున్నారు’’ అని హరిహర్‌ బెహరా ఆనందం వ్యక్తం చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని