covid vaccine:అది నకిలీ వార్త..వాస్తవమిదే

తాజా వార్తలు

Updated : 27/05/2021 12:05 IST

covid vaccine:అది నకిలీ వార్త..వాస్తవమిదే

దిల్లీ: ప్రపంచమంతా కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. సామాజిక మాధ్యమాల్లోని నకిలీ వార్తలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నెట్టింట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఏ మేరకో వాస్తమైందో ఒక్కోసారి ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. ఆ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం, నిపుణులు ఎప్పటికప్పుడు ఆ సందేహాలను నివృత్తి చేస్తున్నారు. తాజాగా కరోనా టీకా గురించి చక్కర్లు కొడుతున్న ఓ నకిలీవార్తను పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ కొట్టిపారేసింది. నిస్సంకోచంగా టీకా వేయించుకోవచ్చని తెలిపింది. ఇంతకీ విషయం ఏమిటంటే..

కరోనా టీకాలు వేయించుకున్న వ్యక్తులు రెండేళ్లలో మరణిస్తారంటూ ఉన్న ఓ చిత్రం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అ వార్తను నిజమని నమ్మించేలా దానిపై ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్‌ గ్రహీత ఫొటోను జోడించారు. అంతేకాదు కెనడాలోని ఓ అతివాద వెబ్‌సైట్‌ ప్రచురించిన వార్తను కూడా ప్రచారంలోకి తెచ్చారు. ఈ విషయం గమనించిన పీఐబీ ఫ్యాక్ట్ నిజాన్ని నిగ్గుతేలుస్తూ ట్వీట్ చేసింది. ‘కొవిడ్‌-19 టీకాల గురించి ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్ గ్రహీత చిత్రంతో కూడిన ఓ సందేశం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులోని విషయం పూర్తి అవాస్తవం. కరోనా టీకా సురక్షితమైంది. ఈ సందేశాన్ని ఇతరులకు ఫార్వర్డ్‌ చేయొద్దు’ అంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టతనిస్తూ..హెచ్చరించింది.

మరోవైపు, జనవరి 16న భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికింద ఇప్పటివరకు 20కోట్ల మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. మన దేశంలో అత్యవసర వినియోగం కింద కొవాగ్జిన్ , కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి టీకాలను అందిస్తున్నారు. త్వరలో మరికొన్ని సంస్థలకు చెందిన టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కరోనాను తరిమికొట్టేందుకు ప్రస్తుతం మానవాళి ముందు ఉన్న పరిష్కారం టీకానే..!

అదోక కరుడుగట్టిన వెబ్‌సైట్‌..

ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చిన వెబ్‌సైట్‌ పైరు లైఫ్‌సైట్‌న్యూస్‌. కెనడాకు చెందిన అతివాద సంప్రదాయ వెబ్‌సైట్‌ అది. అబార్షన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిలో వచ్చే ఆర్టికల్స్‌ ఎక్కువగా ఆచార వ్యవహారాలు, నమ్మకాలపై ఉంటాయి. సంచలనం కోసం కొవిడ్‌ 19పై పుకార్లను ప్రచారంలో తీసుకొస్తుండటంతో దీనిని కొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు నిషేధించాయి. 2016లో ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ ‘స్నోప్స్‌’ దీనిని తప్పుడు సమాచారాలను వ్యాప్తి చేసే వేదికగా అభివర్ణించింది.  

* 2018 నుంచి ట్విటర్‌ ఈ వెబ్‌సైట్‌ ఖాతాను కనీసం నాలుగు సార్లు తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. కొవిడ్‌-19పై తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు కూడా ఇటీవల సస్పెండ్‌ చేసింది. 

* 2021 ఫిబ్రవరిలో లైఫ్‌సైట్‌న్యూస్‌ ఛానల్‌ను యూట్యూబ్‌ బ్యాన్‌ చేసింది. అది కూడా కొవిడ్‌19పై తప్పుడు సమాచారం ప్రచారంలోకి తెచ్చినందుకే కావడం గమనార్హం. 

* ఈ నెలలోనే ఫేస్‌బుక్‌ కూడా దీని ఖాతను బ్యాన్‌ చేసింది. వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసే ఖాతాలను తొలగించడంలో భాగంగా ఈ చర్య తీసుకొంది.  లైఫ్‌సైట్‌న్యూస్‌ వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌లో చేసిన దాదాపు 100 తప్పుడు పోస్టులపై మీడియా మ్యాటర్స్‌ ఫర్‌ అమెరికా, గ్లాడ్‌, ది హ్యూమన్‌ రైట్స్‌ క్యాంపెయిన్‌ వంటి సంస్థలు ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశాయి.  అసలు ఫేస్‌బుక్‌ ఈ సంస్థ అకౌంట్‌ను కొన్నేళ్ల కిందటే బ్యాన్‌ చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించాయి. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని