Third wave: ‘మూడో’ ముప్పు.. 3 అవకాశాలు!

తాజా వార్తలు

Published : 04/07/2021 11:00 IST

Third wave: ‘మూడో’ ముప్పు.. 3 అవకాశాలు!

దిల్లీ: కరోనా కట్టడి నిబంధనల్ని పటిష్ఠంగా పాటించకపోయినట్లయితే మహమ్మారి మూడో దశలో కేసులు అక్టోబర్‌-నవంబరు మధ్య గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, రెండో వేవ్‌లో నమోదైన రోజువారీ కేసులతో పోలిస్తే మూడో వేవ్‌లో వాటిలో సగం మాత్రమే రికార్డవుతాయని తెలిపారు. ఒకవేళ సంక్రమణ సామర్థ్యం అధికంగా ఉన్న వైరస్‌లు వెలుగు చూస్తే మూడో వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తిని గణిత పద్ధతుల్లో అంచనా వేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంలో సభ్యుడిగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్‌ ఈ విషయాలను వెల్లడించారు.

‘సూత్ర మోడల్‌’ను అభివృద్ధి చేసిన ఈ బృందం మూడో వేవ్‌ సంభావ్యతను మూడు రకాలుగా అంచనా వేసింది. ఒక్కో రకంలో కేసుల విజృంభణ ఎలా ఉండబోతోందో తెలిపింది.

ఆప్టిమిస్టిక్‌ (ఆశాజనక పరిస్థితులు): ఈ అంచనా ప్రకారం.. జీవన పరిస్థితులు ఆగస్టు నాటికి సాధారణ స్థితికి చేరుకుంటాయి. కొత్త వేరియంట్లు ఏవీ రావు. రోజువారీ కేసులు 50 వేల నుంచి లక్ష మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది.

ఇంటర్మీడియెట్‌ (మధ్యస్థ పరిస్థితులు): ఈ అంచనా ప్రకారం.. ఆప్టిమిస్టిక్‌ పరిస్థితులతో పాటు వ్యాక్సినేషన్‌ 20 శాతం తక్కువ ప్రభావం చూపితే.. పరిస్థితులు కాస్త తీవ్రంగా మారే అవకాశం ఉంది. దీంట్లోనూ రోజువారీ కేసులు 50 వేల నుంచి లక్ష మధ్యలో నమోదవుతాయి. కానీ, ఆప్టిమిస్టిక్‌ పరిస్థితుల్లో రికార్డయ్యే కేసుల కంటే ఎక్కువే ఉంటాయి.

పెసిమిస్టిక్‌ (నిరాశజనక పరిస్థితులు): ఈ పరిస్థితుల్లో 25 శాతం అధిక సంక్రమణ సామర్థ్యం ఉన్న వైరస్‌ ఆగస్టులో వ్యాప్తి చెందుతుంది. అయితే, అది డెల్టా ప్లస్‌ మాత్రం కాదు. కేసుల విషయానికి వస్తే రోజుకి 1,50,000 నుంచి 2,00,000 వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో వేవ్‌ గరిష్ఠ స్థాయిల్లో నమోదైన కేసులతో పోలిస్తే ఇది సగం.

వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరింత వేగంగా కొనసాగితే మూడు, నాలుగో వేవ్‌లు సంభవించే అవకాశం తక్కువని నిపుణులు తెలిపారు. ఈ బృందంలో మరో సభ్యుడైన ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్త విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. మూడో వేవ్‌లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్‌లో పురోగతి సాధిస్తున్న కొద్దీ మహమ్మారి ముప్పు మరింత తగ్గుతూ వస్తుందని పేర్కొన్నారు. యూకేలో ఇదే జరిగిందన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని