అవయవ మార్పిడి వారికి మూడో డోసుతో రక్షణ?

తాజా వార్తలు

Published : 15/06/2021 16:22 IST

అవయవ మార్పిడి వారికి మూడో డోసుతో రక్షణ?

తాజా అధ్యయనంలో మెరుగైన ఫలితాలు

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో తీసుకున్న వారికి వైరస్‌ నుంచి పూర్తి రక్షణ కలుగుతోందని ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారితోపాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులు రెండు డోసులు తీసుకున్నా.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వారిలో అభివృద్ధి కాకపోవడమో లేదా త్వరగా క్షీణించిపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవయవ మార్పిడి వారు మూడో డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.

అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన బాధితుల్లో కొందరికి రెండో డోసు తీసుకున్నా.. యాంటీబాడీలు వృద్ధి కావడం లేదని ఈమధ్యే జరిగిన పరిశోధనల్లో నిపుణులు గుర్తించారు. ఇలాంటి వారిపై మరింత అధ్యయనం కొనసాగించిన జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ (జేహెచ్‌యూ) పరిశోధకులు, అవయవ మార్పిడి జరిగిన 30 మంది బాధితులపై మూడో డోసు ఇచ్చి పరీక్షలు చేపట్టారు. ఇలాంటి వారికి రెండు డోసుల అనంతరం స్వల్ప స్థాయిలోనే యాండీబాడీలు వృద్ధి చెందగా.. మూడో డోసు ఇచ్చిన అనంతరం యాంటీబాడీలు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న రోగుల్లోనూ ఇమ్యూన్‌ సిస్టమ్‌ పునరుత్తేజమవుతుందని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోందని జేహెచ్‌యూ ఎపిడమాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ డోరీ సెగెవ్‌ పేర్కొన్నారు. అయితే, ఏ సమయంలో, ఎంత గడువు తర్వాత ఈ డోసు ఇస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని తెలుసుకునేందుకు ఎక్కువ మందితో మరింత అధ్యయనం చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఇక అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన బాధితులతోపాటు రోగనిరోధకత తక్కువగా ఉండే వ్యక్తుల్లో వ్యాక్సిన్‌ పనితీరుపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్జీనియా కామన్వెల్త్‌ యూనివర్సిటీ దాదాపు 380 కిడ్నీ మార్పిడి బాధితులపై అధ్యయనం జరుపుతోంది. ఇక అమెరికాలో మోడెర్నా, ఫైజర్‌ టీకా తీసుకున్న 658 మంది అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులపై జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పటికే అధ్యయనం చేపట్టారు. వీరిలో తొలిడోసు తీసుకున్న 98 మందిలో, రెండో డోసులు తీసుకున్న 357 మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. మరో 259 మందిలో రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఎలాంటి యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని కనుగొన్నారు. ఇలాంటి వారికి మూడో డోసు ఇవ్వడం వల్ల వచ్చే ఫలితాలపై నిపుణులు దృష్టి సారించారు. ఇలా జరిపిన అధ్యయనంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నట్లు జేహెచ్‌యూ పరిశోధకులు వెల్లడించారు. ఇలా అవయవ మార్పిడి చేసుకున్న కొందరికి రెండు డోసులతో రక్షణ కల్పిస్తున్నప్పటికీ మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదిలాఉంటే, గతకొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అవయవ మార్పిడి చేయించుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం అమెరికాలోనే 2017 నుంచి దాదాపు లక్షా 60వేల మంది అవయవ మార్పిడి చేయించుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని