మనవరాలి కోసం ఇల్లు అమ్మి.. ఆటోలో ఉంటూ 

తాజా వార్తలు

Published : 12/02/2021 19:04 IST

మనవరాలి కోసం ఇల్లు అమ్మి.. ఆటోలో ఉంటూ 

హృదయాలను హత్తుకుంటున్న ఆటోవాలా కథ

ఇంటర్నెట్‌డెస్క్‌: బక్కపల్చని శరీరం.. నెరిసిన జుట్టు.. బోసినవ్వులు చిందిస్తున్న ఈ తాత పేరు దేశ్‌రాజ్‌. కల్మషం లేని ఆ నవ్వుల వెనుక భరించలేనన్ని బాధలు.. వంగిపోయిన ఆ భుజాల వెనుక మోయలేనన్ని బాధ్యతలున్నాయి. కాయకష్టం చేయలేని వయసులో ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న ఈ తాత.. ఒంటెద్దు బండిలా కుటుంబాన్ని లాగుతున్నాడు. రెక్కాడితే గానీ.. డొక్కాడని స్థితిలో మనవరాలిని చదివించేందుకు ఉన్న ఇల్లు అమ్మేసి ఆటోలో ఉంటున్నాడు. మనవరాలు తాను అనుకున్నది సాధిస్తే ఈ బాధలన్నీ మర్చిపోతానంటున్నాడు ఈ పెద్దాయన. అయినా ఈ వయసులో ఆయనకు ఇన్ని కష్టాలు ఎలా వచ్చాయో ఆయన మాటల్లోనే..

‘‘ఆరేళ్ల క్రితం ఒక రోజు నా పెద్ద కొడుకు ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. వారం తర్వాత వాడు చనిపోయాడని తెలిసింది. అప్పుడు నా కొడుకు వయసు 40ఏళ్లు. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏడ్చే సమయం కూడా లేదు. బాధ్యతలు గుర్తొచ్చి రెండో రోజే ఆటో పట్టుకుని రోడ్డెక్కా. రెండేళ్ల తర్వాత మరో విషాదం. ఒక రోజు ఆటో నడుపుతుండగా.. నాకు ఫోనొచ్చింది. ‘మీ రెండో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇద్దరు కొడుకులను కోల్పోయాను. కానీ భార్య, కోడళ్లు, వాళ్ల నలుగురు పిల్లలు.. వీరందరి పరిస్థితి ఏంటి? వాళ్ల బాధ్యత నాదే కదా? చిన్న కొడుకు పోయాక, నా మనవరాలు వచ్చి.. ‘తాతయ్య నేను చదువు మానేయాలా?’ అని అడిగింది. ఆ సమయంలో ఏం చెప్పాలో తెలియలేదు. కానీ ధైర్యం కూడగట్టుకుని.. ఎట్టిపరిస్థితుల్లోనూ చదువును వదలొద్దని చెప్పా’’

‘‘కుటుంబం కోసం ఎక్కువ గంటలు పనిచేయడం మొదలుపెట్టా. ఉదయం 6 గంటలకు వెళ్తే ఎప్పుడో అర్ధరాత్రి వచ్చేవాడిని. ఆటో నడిపితే నెలకు రూ.10వేలు వచ్చేవి. అందులో రూ.6000 పిల్లల స్కూల్‌ ఫీజులకు, ఇతరత్రా వాటికే పోయేవి. మిగతా రూ.4000 వేలతోనే నెలంతా తినాలి. చాలా సార్లు ఒక్కపూట తినడానికి కూడా కష్టంగా ఉండేది. అయితే అంత బాధలోనూ నాకు ఆనందం కలిగించిన విషయం ఏంటంటే.. 12వ తరగతిలో నా మనవరాలు 80శాతం మార్కులతో పాసైంది. ఆ రోజు నా ఆటోలో ప్రయాణికులను ఉచితంగా ఎక్కించుకున్నా..’’

‘‘టీచర్‌ కావాలని నా మనవరాలి కోరిక. కానీ చదివించే స్తోమత నాకు లేదు. అయితే ఎలాగైనా తనను టీచర్‌ను చేయాలనుకున్నా. అందుకోసం మేం ఉంటున్న ఇంటిని అమ్మేసి తనకు ఫీజు కట్టా. ఆ తర్వాత నా భార్య, కోడళ్లు, మిగతా మనవళ్లను మా ఊరిలోని బంధువుల ఇంటికి పంపేశా. నేను మాత్రం ముంబయిలోనే ఉంటున్నా. ఇక్కడ నాకు ఉండటానికి ఇల్లు లేదు. అందుకే ఆటోలోనే తింటున్నా.. ఆటోలోనే పడుకుంటున్నా. ఇది జరిగి ఏడాది అయ్యింది. మనవరాలు దిల్లీలో చదువుతోంది. తను ఫోన్‌ చేసి ‘నేను క్లాస్‌లో ఫస్ట్‌ వచ్చాను తాతయ్య’ అని చెప్పినప్పుడు నా బాధలన్నీ పోయి సంతోషంగా అనిపిస్తుంది. తను ఎప్పుడెప్పుడు టీచర్‌ అవుతుందా అని ఆనందంగా ఎదురుచూస్తున్నా. ఆ రోజు నేను తనను హత్తుకుని మమ్మల్ని గర్వపడేలా చేశావమ్మా అని చెప్పాలి. ఎందుకంటే మా కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన తొలి వ్యక్తి తనే. ఆ రోజు కూడా నా ఆటోలో అందిరినీ ఉచితంగానే ఎక్కించుకుంటా’’ అని చిరునవ్వుతో చెప్పుకొచ్చారు దేశ్‌రాజ్‌ తాత. 

ఈయన గురించి ప్రముఖ సోషల్‌ మీడియా పేజీ హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే చేసిన ఈ పోస్ట్ వైరల్‌ అయ్యింది. దేశ్‌రాజ్‌ కథ చదివి నెటిజన్ల హృదయం ద్రవించింది. అంతేకాదు.. ఓ ఫేస్‌బుక్‌ యూజర్‌.. ఫండ్‌రైజర్‌ కార్యక్రమం చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.5లక్షల వరకు విరాళాలు వచ్చాయి. మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేత అర్చనా దాల్మియా కూడా దేశ్‌రాజ్‌ గురించి తన ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఆయనకు సాయం చేయాలంటూ నెటిజన్లను కోరారు. 

ఇదీ చదవండి..

వాళ్లు రాసే ఉత్తరాలే నాకు స్ఫూర్తి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని